హోంకు చేరకుండా.. హోం క్వారంటైన్‌ ఎలా?

ABN , First Publish Date - 2020-03-23T10:25:48+05:30 IST

హోం క్వారంటైన్‌.. కరోనా వైరస్‌ అనుమానితులకు ఇప్పుడీ స్టాంప్‌ ఓ పీడకల! ఈ ముద్ర ఉందంటే చాలు నేరస్థులుగా పరిగణిస్తున్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

హోంకు చేరకుండా.. హోం క్వారంటైన్‌ ఎలా?

స్టాంపులతో అనుమానితుల అవస్థలు

శంషాబాద్‌ నుంచి ఇంటికి వెళ్లలేని దైన్యం

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వాసుల ఇక్కట్లు

ప్రభుత్వమే రవాణా ఏర్పాటు చేయాలి

లేదంటే హైదరాబాద్‌లోనే ఉంచాలి

ఆక్రోశిస్తున్న అనుమానితులు

హోం ఇక్కడ లేదు.. హోం క్వారంటైన్‌ ఎలా?



(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): హోం క్వారంటైన్‌.. కరోనా వైరస్‌ అనుమానితులకు ఇప్పుడీ స్టాంప్‌ ఓ పీడకల! ఈ ముద్ర ఉందంటే చాలు నేరస్థులుగా పరిగణిస్తున్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విదేశాల నుంచి వచ్చి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లాలంటే శంషాబాద్‌ విమానాశ్రయమే కీలకం. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడే దిగుతుంటారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ ఉంటే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆ ముప్పులేని వారికి 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తూ స్టాంప్‌ వేస్తున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం అనుమానితులు పలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నవారు మాత్రం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెళ్లిపోగలిగారు. తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మాత్రం అవస్థలు పడ్డారు. బస్సులు, రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాలు లేక రైల్వేస్టేషన్లు, బస్‌స్టాఫుల వద్దే ఉండిపోయారు. చేతిపై ముద్రలు చూసి కొందరు పోలీసులకు ఫోన్‌ చేసి పట్టించారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచే రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని వారు వాపోయారు.

Updated Date - 2020-03-23T10:25:48+05:30 IST