అప్పు చెల్లించలేదని గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-12-28T09:01:18+05:30 IST

కర్నూలు జిల్లా శిరివెళ్ల మేజర్‌ గ్రామ పంచాయతీలో ఓ వ్యక్తిని అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్భంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అప్పు చెల్లించలేదని గృహ నిర్బంధం

పంచాయతీ కాంట్రాక్టర్‌పై వైసీపీ నాయకుల దౌర్జన్యం


కర్నూలు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా శిరివెళ్ల మేజర్‌ గ్రామ పంచాయతీలో ఓ వ్యక్తిని అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్భంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యాలయంలో కొన్నేళ్లుగా పారిశుధ్య కాంట్రాక్టర్‌గా పనిచేస్తోన్న గొల్ల గుర్రప్ప శిరివెళ్లలోని వైసీపీ నాయకుడు సలాం సోదరుడు రఫీ వద్ద విడతల వారీగా సుమారు రూ.34 లక్షలు అప్పు తీసుకుని, రూ.26 లక్షలు చెల్లించాడు. ఇంకా రూ.25 లక్షలు చెల్లించాలని వారు ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 24న గుర్రప్పను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అప్పు చెల్లించేందుకు 3 నెలలు గడువు కోరాడు.  సివిల్‌ పంచాయితీ తేల్చుకోవాలని  ఎస్‌ఐ సూచించారు. అదే రోజు రాత్రి సలాం తనను వెంట పెట్టుకుని వెళ్లి ఆయన సోదరుడు రఫీ ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించాడని బాధితుడు వాపోయాడు.  దాదాపు 20 ఖాళీ బాండు పేపర్లపై తనతో, తన తండ్రితో సంతకాలు చేయించుకున్నారని కన్నీటిపర్యంతమయ్యాడు. మూడు రోజులు గృహ నిర్భంధంలో బిక్కుబిక్కుమంటూ బతికానని ఆవేదన వ్యక్తం చేశాడు. 


డయల్‌ 100కు ఫిర్యాదు 

 తండ్రిని విడిపించుకునేందుకు గుర్రప్ప కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ డయల్‌ 100కు ఆదివారం ఫిర్యాదు చేశాడు. దీంతో  సలాం గుర్రప్పను శిరివెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో విడిచిపెట్టి వెళ్లాడు.  శిరివెళ్ల ఎస్‌ఐ సూర్యమౌలిని వివరణ కోరగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. గ్రామ పంచాయతీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తాను గ్రామంలో దాదాపు రూ.20 లక్షల మేర పనులు చేశానని గుర్రప్ప తెలిపాడు. కానీ పంచాయతీలో బిల్లులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించాడు.  ఈ తరుణంలో చేసిన అప్పులపై అధిక వడ్డీలు విధించి, తనను మూడు రోజులపాటు నిర్బంధించారని ఆయన వివరించారు.

Updated Date - 2020-12-28T09:01:18+05:30 IST