ఇల్లు కట్టుకోకున్నా స్థలమా?

ABN , First Publish Date - 2020-03-24T08:46:41+05:30 IST

‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఇచ్చే స్థలాన్ని ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు

ఇల్లు కట్టుకోకున్నా స్థలమా?

షరతు లేకుండా కేటాయింపు ఎలా?

ఐదేళ్ల తర్వాత విక్రయం సరికాదు

పేదలకు ఇళ్ల జీవోపై అభ్యంతరం

‘కన్వేయన్స్‌’ను నిలిపివేసిన హైకోర్టు

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఇచ్చే స్థలాన్ని ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 44ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. ఆ ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ‘‘ఇల్లు నిర్మించుకోవాలన్న షరతు లేకుండా ఆ స్థలం ఎలా కేటాయిస్తారు? ఐదేళ్ల తర్వాత స్థలాన్ని విక్రయించుకునేందుకు వీలు ఎలా కల్పిస్తారు?’’ అని ప్రశ్నించింది. రాజధానికోసం సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాలు చేసిన ఎ.నంద కిశోర్‌ అనే వ్యక్తి... తన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి అనుబంధంగా.... తప్పనిసరిగా ఇల్లు నిర్మించుకోవాలనే షరతు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం తప్పంటూ మరో పిటిషన్‌ వేశారు. లబ్ధిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తహసీల్దార్లకు అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన జీవో 44ను కూడా నిలుపుదల చేయాలని ఆయన అభ్యర్థించారు. రాజధాని భూములపై ఇచ్చిన జీవో 107ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలలోనే, త్రిసభ్య ధర్మాసనం జీవో 44ను కూడా ఆపివేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపించారు.

Updated Date - 2020-03-24T08:46:41+05:30 IST