హైకోర్టుకు వ్యతిరేకం కాదు
ABN , First Publish Date - 2020-02-08T08:46:34+05:30 IST
‘‘రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే జనసేన ఎప్పుడూ సహకారం అందిస్తుంది.

ప్రజలను మభ్య పెట్టడానికే మూడు రాజధానులు
ముస్లింలకు సీఏఏతో నష్టం లేదు
12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటన: పవన్ కల్యాణ్
కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 7: ‘‘రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే జనసేన ఎప్పుడూ సహకారం అందిస్తుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. 3రాజధానుల ఏర్పాటు ప్రజలను మభ్యపెట్టడానికే. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. రాజధాని మార్పు నిర్ణయం వల్ల వేలాది కోట్ల ప్రజాధనం వృథా అవడమే తప్ప రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదు’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కర్నూలు, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజవర్గాల ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో కర్నూలు ప్రాంతంలో రాజధాని పెడతామని అప్పటి టీడీపీ ప్రకటిస్తే మద్దతు ఇచ్చేవాళ్లమని తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం వల్ల ప్రజలే నష్టపోతున్నారని, నాయకులు బాగానే ఉన్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి గతంలో రాజధానికి అమరావతిలో 30 వేల ఎకరాలు కావాలన్నారని, మరి ఇప్పుడు ఎందుకు మాటమారుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని మాట్లాడిన తన దిష్టిబొమ్మను దగ్ధం చేసేటంత కోపం ఉన్న కర్నూలు నాయకులకు.. సుగాలి ప్రీతిబాయిని హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని ప్రశ్నించారు. రాయలసీమలో ఐటీ హబ్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మైనార్టీలు నమ్మక ద్రోహం చేశారని అంటున్నారని, దశాబ్దాలుగా సెక్యులర్లమని అని చెప్పుకుంటున్న ఏ పార్టీ కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయిందని ఆయన అన్నారు. ముస్లింలకు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వల్ల ఎటువంటి ఇబ్బందులు రావని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12, 13 తేదీలో కర్నూలు జిల్లా పర్యటకు వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 12న కర్నూలులో జరిగే కార్యక్రమంతో పాటు 13న ఎమ్మిగనూరులో చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకుంటానని పవన్ తెలిపారు.