-
-
Home » Andhra Pradesh » High Court Govt
-
మీకు అధికారం లేదు!
ABN , First Publish Date - 2020-03-24T08:45:17+05:30 IST
రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ...

సర్కారుకు హైకోర్టులో ఒకే రోజు మూడు కేసుల్లో చుక్కెదురైంది. అవన్నీ ‘ఇళ్ల స్థలాల’కు సంబంధించినవే! రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం... ‘నవరత్నాల’ పథకంలో భాగంగా పేదలు తమకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలు కల్పించే కన్వేయన్స్ పట్టా జారీ జీవోలను ఒకే తీర్పులో తప్పుపట్టింది. విశాఖలో పేదలకు స్థలాల కోసం భారీగా భూములు సమీకరించడాన్ని ఆపివేస్తూ మరో తీర్పు చెప్పింది.
రాజధాని భూముల్లో ఇళ్లస్థలాలు కుదరదు
ఆ అధికారం సీఆర్‌డీఏకు మాత్రమే ఉంది
ప్రభుత్వ ఉత్తర్వులు చట్ట ఉల్లంఘనే
రాజధానిలో ‘ఇళ్ల స్థలాల’పై తేల్చి చెప్పిన హైకోర్టు
జీవో 107 సస్పెండ్ చేసిన త్రిసభ్య ధర్మాసనం
అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తేల్చి చెప్పింది. రాజధాని భూములను ఇళ్ల స్థలాలకు కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సర్వాధికారాలు సీఆర్‌డీఏకే ఉన్నాయని తెలిపింది. రాజధానిలో భూ కేటాయింపు అధికారం సీఆర్‌డీఏ అథారిటీ, అదనపు కమిషనర్, భూ కేటాయింపు పరిశీలనా మండలికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ జీవో సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని అభిప్రాయపడింది. రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన భూమిలోని 1251 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇస్తూ ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 107ను సస్పెండ్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూమిలో ‘నవ రత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద స్థలాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎ.నందకిశోర్, కె.సాంబశివరావు, జి.హరిగోవిందప్రసాద్, పఠాన్ మున్నా అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై... సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించింది.
పిటిషనర్లు ఏమన్నారంటే?
పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, ప్రణతి తదితరులు వాదనలు వినిపించారు. ‘‘తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు మాత్రమే రాజధాని పరిధి కిందకు వస్తాయి. రాజధాని ప్రాంతంలో ఇతర మండలాలకు చెందిన వారికి భూములివ్వడం సరికాదు. ఇది సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చింది రాజధాని కోసమే తప్ప బయటి ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కోసం కాదు. భూసమీకరణ సమయంలో ఆ భూముల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు దాని నుంచి తప్పుకునేందుకు ప్రయత్నించడం సరి కాదు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పంపిణీ చేసిన ప్లాట్లను అభివృద్ధి చేసిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ ఆ విషయమే పట్టించుకోవడం లేదు. రాజధానిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పుడు 5 శాతం భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వవచ్చు. కానీ... అసలు అభివృద్ధి పనులే చేపట్టలేదు. గృహాల కోసం కేటాయించిన భూముల్ని శుభ్రం చేసేందుకు, హద్దు లు నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచింది. కేసు విచారణలో ఉండగానే ప్రభుత్వం ఇలా టెండర్లు పిలవడం సరి కాదు. అందువల్ల విచారణ పూర్తయ్యే వరకూ ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాలి. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని అభ్యర్థించారు. వారి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. సదరు జీవోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.