-
-
Home » Andhra Pradesh » High Court comments on Police behaviour in Capital villages
-
ఆ వీడియోను చూశారా..? అని ఏపీ డీజీపీని అడిగి మరీ.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2020-03-13T15:19:27+05:30 IST
పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఇదేనా పద్ధతి’ అని నిలదీసింది. అటు విశాఖపట్నంలో సీఆర్పీసీ సెక్షన్ 151 కింద విపక్షనేత చంద్రబాబును అరెస్టు చేయడం..

అమరావతి(ఆంధ్రజ్యోతి): పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఇదేనా పద్ధతి’ అని నిలదీసింది. అటు విశాఖపట్నంలో సీఆర్పీసీ సెక్షన్ 151 కింద విపక్షనేత చంద్రబాబును అరెస్టు చేయడం... ఇటు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి డీజీపీని ఉక్కిరి బిక్కిరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ శాఖల తీరుపై హైకోర్టు విరుచుకుపడింది. అసలు ఇది రాష్ట్రమా... మరొకటా! అని విస్మయం వ్యక్తం చేసింది.
చంద్రబాబుకు ఆ నోటీసును ఇచ్చి అదుపులోకి తీసుకోవడం తప్పేనని ఒప్పుకున్న డీజీపీ.. రాజధాని గ్రామాల్లో 500 మంది పోలీసులతో ప్లాగ్ మార్చ్ నిర్వహించడంపై కూడా హైకోర్టుకు సమాధానమిచ్చే విషయంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆ ఒక్కరోజే అలా జరిగిందని డీజీపీ చెప్పగా.. అన్నీ తమకు తెలుసునంటూ.. వరుసగా జరుగుతూనే ఉందనీ హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని గ్రామాల్లో వందల సంఖ్యలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించడం గురించి హైకోర్టు ఏమన్నదంటే..
ధర్మాసనం: మీరు పెన్‌డ్రైవ్‌లో ఉన్న వీడియోను చూశారా?
డీజీపీ: చూశాను.
ధర్మాసనం: ఆ గ్రామంలో 500 మంది పోలీసులు ఎందుకున్నారు? అక్కడ అంతమంది అవసరమా? ఆ వీడియోలోని పోలీసు హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంత అవసరం ఏం వచ్చింది?
డీజీపీ: అది జనవరి 10 తేదీన... రాజధాని ఆందోళనలు మొదలైన 22 రోజుల తరువాత మందడంలో జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు.
ధర్మాసనం: నిరసన ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు అంతమంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ప్రకటన మనం ప్రజాస్వామ్య దేశంలో లేమన్న భావన కలిగించేలా ఉంది. 500 మంది పోలీసులు కశ్మీర్‌లో ఫ్లాగ్‌మార్చ్ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడంత అవసరమేమొచ్చింది?
డీజీపీ: ఆ ఒక్కరోజే అలా జరిగింది.
ధర్మాసనం: ఒక్కరోజు కాదు. వరుసగా జరుగుతూనే ఉంది. మీరు రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతి. చట్టప్రకారం నడుచుకోనివారిపై చర్యలు తీసుకోండి. దీనిపై మళ్లీ మళ్లీ చెప్పబోం. ‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎలా? నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. మా ఆదేశాలు అమలు చేస్తారని ఆశిస్తున్నాం.
డీజీపీ: థ్యాంక్యూ సర్. చట్టాల్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాను. అది నా కర్తవ్యం. మీ ఆదేశాలను పాటిస్తాను.
సాయంత్రం దాకా కోర్టులోనే!
డీజీపీ గౌతం సవాంగ్ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైకోర్టులోనే గడిపారు. ఉదయం 10.25 గంటలకు కోర్టుకు వచ్చిన డీజీపీ సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆయనతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వచ్చారు.