‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ ఉత్తర్వులు వెనక్కి తీసుకోం
ABN , First Publish Date - 2020-12-15T09:25:20+05:30 IST
రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తామంటూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే (రీకాల్) ప్రసక్తే లేదని హైకోర్టు
విచారణ సాగదీత కోసమే మీ అనుబంధ పిటిషన్
3 రాజధానుల మద్దతుదారులు
నల్లజెండాలు చూపిస్తారా: ధర్మాసనం
విచ్ఛిన్నంపై సుప్రీంకు వెళ్తాం: ఏజీ
వెళ్తే వెళ్లండి.. విచారణ ఆగదు
ప్రభుత్వాలు వస్తుంటాయి,
పోతుంటాయి.. వ్యవస్థలు ముఖ్యం
హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
వ్యవస్థలు ముఖ్యమని హైకోర్టు స్పష్టీకరణ
తదుపరి విచారణ రేపటికి వాయిదా
ప్రభుత్వ అనుబంధ వ్యాజ్యం తోసివేత
రాజ్యాంగ విచ్ఛిన్నంపై కోర్టు విచారణ సాగదీత కోసమే ప్రభుత్వం అనుబంధ పిటిషన్ (ఐఏ) దాఖలు చేసింది. ఏదైనా అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. మేం మాత్రం విచారణను ఆపే ప్రసక్తే లేదు.
ఏజీ శ్రీరాం
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తామంటూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే (రీకాల్) ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అదేవిధంగా మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా మందడం సమీపంలో హైకోర్టుకు వెళ్లే దారి పక్కగా నిరసన దీక్ష చేస్తున్న వారు.. న్యాయమూర్తులకు నల్లజెండాలు చూపడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో డీజీపీని, జిల్లా కలెక్టర్‌ను పిలిచించి వివరణ కోరాల్సి ఉన్నప్పటికీ, తాము సంయమనం పాటిస్తున్నామని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై ప్రభుత్వ వాదనల కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లతో పాటు ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని, ప్రతిపక్ష నేతల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గత అక్టోబరు 1వ తేదీన రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని, ఆ దిశగా వాదనలు వినిపించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా తమ ముందుంచాలని పిటిషనర్లకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా పిటిషన్లపై సోమవారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
వారికి ఆంక్షలు.. వీరికి అనుమతులు: న్యాయవాది ప్రణతి
మూడు రాజధానులకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న వారికి అన్ని రకాలుగా అనుమతులిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతికి మద్దతుగా నిరసన చేపట్టిన వారికి మాత్రం రకరకాల ఆంక్షలు విధిస్తోందని శ్రావణ్‌కుమార్ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి హైకోర్టుకు వివరించారు. అమరావతి మద్దతుదారులకు కొన్ని చోట్ల అనుమతి ఇచ్చినా, కనీస భద్రత కల్పించడం లేదనన్నారు. ‘శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది, పోలీసులదే. రాజధానికి చెందిన 29 గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందన్న కారణంగా రైతుల నిరసనలకు అనుమతి నిరాకరిస్తున్నారు. అదే మూడు రాజధానులకు మద్దతుగా నిరసనలు చేస్తున్న వారికి పటిష్ఠ భద్రత కల్పించడంతో పాటు వారు స్పీకర్లు, బ్యానర్లు పెట్టుకునేందుకు కూడా అనుమతిస్తున్నారు. ఏడాది కాలంగా నిరసన చేస్తున్న వారికి కనీసం మైకు పెట్టుకునేందుకు అనుమతించడం లేదు. కొన్ని మార్లు ప్రతిపక్షాలు చేసే నిరసన కార్యక్రమాలకు పోటీగా అధికార పార్టీ వారు చేపట్టేవాటికి పోలీసులు అనుమతిస్తున్నారు.
దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పిటిషనర్ ఒక రాజకీయ పార్టీకి చెందినవారైనంత మాత్రాన ప్రజా హక్కుల కోసం పిల్ దాఖలు చేయకూడదనడం సరికాదు. పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు నడచుకుంటూ ప్రజల హక్కులను హరిస్తున్నారు. ప్రజా చైతన్యయాత్ర కోసం విశాఖ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇచ్చిన వ్యవహారంలో బాధ్యుడైన విశాఖ పోలీసు కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తే.. కేవలం అసిస్టెంట్ కమిషనర్‌పై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులపై నిబంధనల ఉల్లంఘనల కేసులు కోకొల్లలుగా ఉన్నాయి’ అని తెలిపారు.
హైకోర్టుకు విచారణార్హత లేదు: ఎస్‌ఎస్ ప్రసాద్
రాజ్యాంగ వ్యవస్థలు విఫలమవ్వడమంటే.. 356 అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందని.. రాజకీయ సంక్షోభం, న్యాయవ్యవస్థ అస్థిరత, శాసనవ్యవస్థ విఫలమైనప్పుడు తప్ప ఇతర సందర్భాల్లో రాజ్యాంగ విచ్ఛిన్నంగా పరిగణించడానికి లేదని పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్, సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చే విచారణాధికార పరిధి హైకోర్టుకు లేదన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగినట్లు కోర్టు రికార్డు చేస్తే.. అది ఆర్టికల్ 356 కింద గవర్నర్ ఇచ్చే నివేదికతో సమానమన్నారు. అలాంటి నివేదిక విమర్శలకు కారణమవుతుందని, కోర్టు ఆ విమర్శల్లో చిక్కుకోరాదని సూచించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై జరిగిన వాదనల్లో ‘ఇన్ని రోజుల పాటు’ తాము పాలుపంచుకున్నామని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొనడంపై న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని వ్యాఖ్యానించింది. శ్రావణ్‌కుమార్ దాఖలు చేసిన 700 పేజీల అదనపు అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని ప్రసాద్ అభ్యర్థించారు. అదనపు అఫిడవిట్‌తో పాటు హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొందుపరిచారని, వాటిని పరిగణనలోకి తీసుకోవడంపై మాత్రం అభ్యంతరం లేదన్నారు.
ఈ సందర్భంగా ఆయన వాదనలను ధర్మాసనం నమోదు చేసింది. అనంతరం ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు పరిగణనలోకి తీసుకున్న తీర్పులను తాను అధ్యయనం చేసి వాదనలు వినిపించాల్సి ఉందని.. లేనిపక్షంలో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే అంశంపై తేల్చాలంటే ముందుగా కోర్టు అడ్వకేట్ జనరల్‌కు లేదా అటార్నీ జనరల్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని ప్రసాద్ వివరించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లను బట్టి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్నది తేల్చలేరని, న్యాయస్థానం తమ ముందున్న పిటిషన్లలోని అంశాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు.
విచారణ సాగదీత కోసమే..
విచారణ సాగదీయాలన్న ఉద్దేశంతోనే అనుబంధ పిటిషన్ వేసినట్లుందని, అందుకే దానిని తోసిపుచ్చుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ‘వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్న పోలీసులు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాక, వారిపై కేసు నమోదు చేయడమో, లేక మేజిస్ట్రేట్ ముందు హాజరపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై డీజీపీని పిలిచి వివరణ కోరాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై పోలీసులకు అవగాహన కల్పించి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థపై పలువురు వ్యక్తులు దాడికి దిగారు. ఇలా దాడి చేసినవారిలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కూడా ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించి, ప్రజా హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చాలని అంశంపై వాదనలకు ఆదేశాలిచ్చాం. అనంతరం ఆయా పిటిషన్లపై వివిధ తేదీల్లో విచారణ జరిగింది. అప్పుడు ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయని రాష్ట్రప్రభుత్వం.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అభ్యంతరం ఉంటే ఆదిలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అందుకే ఆ అనుబంధ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’ అని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏజీ వర్సెస్ ధర్మాసనం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. తమ అనుబంధ పిటిషన్‌పై తాను చెప్పేది కోర్టు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇందుకు ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు చేయరాదని, రాష్ట్రప్రభుత్వ వ్యవహార శైలి ఆధారంగానే తాము ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొంది. ఇందుకు ఏజీ స్పందిస్తూ.. తాను చెప్పేది కూడా వినాలని విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘మీరు చెప్పింది ఉత్తర్వుల్లో నమోదు చేశాం. ఏమైనా అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు’ అని వ్యాఖ్యానించింది. అయితే తన వాదనలను వినలేదని.. ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్న విషయాన్నీ రికార్డు చేయాలని ఏజీ కోరారు. విచారణాధికార పరిధిపై తమ అభ్యంతరాలను నమోదు చేయలేదని, ఆ వివరాలను నమోదు చేసేలా కోర్టు నుంచి నిష్పాక్షికతను ఆశిస్తున్నానని తెలిపారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఏజీ నుంచి ఈ తరహా వాదనలను తాము ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహార శైలిని కోర్టు నుంచి తానూ ఊహించలేదని ఏజీ సమాధానమిచ్చారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. వ్యవస్థలు స్థిరంగా నిలిచి ఉంటాయి. వ్యవస్థ ఉంటేనే మీరు ఏజీగా ఉంటారు.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేయగలరు. మీ వాదనలు వినిపించండి’ అని ఆవేదనా భరితంగా వ్యాఖ్యానించింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అక్కడి ఉత్తర్వుల అనంతరమే హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సహకరిస్తామన్నారు. దీనిపట్ల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీరు కోర్టుకు సహాయకారిగా వాదనలు వినిపించినా లేకున్నా మేం విచారణను కొనసాగిస్తాం’ అని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు..