ఏపీఏటీ కేసులు తగిన ఫోరానికి!
ABN , First Publish Date - 2020-03-05T09:10:38+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్(ఏపీఏటీ) రద్దయినందున, దాని వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ నెల రోజుల్లో తగిన ఫోరానికి బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నెల రోజుల్లో బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్(ఏపీఏటీ) రద్దయినందున, దాని వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ నెల రోజుల్లో తగిన ఫోరానికి బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీకి ఇద్దరు సభ్యులను నియమించినప్పటికీ వారు విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు ఎ.సూర్యారావు, ఎస్.కృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరగ్గా.. ఏపీఏటీ రద్దుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని, తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎ్‌సజీ) కోర్టుకు తెలిపారు. అయితే ఆ నోటిఫికేషన్‌లో ఏపీఏటీ రద్దుకు హైకోర్టు ఆమోదం తెలిపినట్లు ఉండడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం మళ్లీ దాన్ని సవరించి గతనెల 27వ తేదీన తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు విచారణ జరగ్గా.. కేంద్రం తాజా నోటిఫికేషన్ ప్రతిని ఏఎ్‌సజీ కృష్ణమోహన్ ధర్మాసనం ముందుంచారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు ఇచ్చింది.