జప్తు వాహనాల విషయంలో నిబంధనలు పాటించరా?

ABN , First Publish Date - 2020-06-23T10:11:25+05:30 IST

వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు తమకు అప్పగించడం లేదని, దీంతో అవి ఎండకు ఎండి,

జప్తు వాహనాల విషయంలో నిబంధనలు పాటించరా?

  • డీజీపీ నుంచి వివరాలు సేకరించండి.. ఏజీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు తమకు అప్పగించడం లేదని, దీంతో అవి ఎండకు ఎండి, వానకు తడిచి పాడైపోతున్నాయని పేర్కొంటూ వరుసగా దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. ఏపీ ఎక్సైజ్‌ 34(ఏ) సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్న వాహనాలను మేజిస్ట్రేట్‌ లేదా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ముందు హాజరు పరచాల్సి ఉండగా, సంబంధిత పోలీసు అధికారులు ఈ నిబంధనల్ని ఎందుకు పాటించడం లేదు? అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీస్‌ స్టేషన్ల ముందు నెలల కొద్దీ ఉండి పాడైపోతున్న వాహనాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది.


ఎక్సైజ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 46, సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 నిబంధనలు పాటించని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. ఆయా వివరాలను రాష్ట్ర డీజీపీ నుంచి సేకరించి తమ ముందుంచాలని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల మేరకు మూడు లేదా అంతకంటే తక్కువ మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు తమ వాహనాలను స్వాధీనం చేసుకున్నారని, తిరిగి అప్పగించడం లేదని ఎక్సైజ్‌, హోంశాఖల వైఖరిని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-06-23T10:11:25+05:30 IST