‘దూకుడు’కు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-03-24T08:43:31+05:30 IST

విశాఖ జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూముల్ని సమీకరించి ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న ప్రభుత్వ యత్నాలకు ...

‘దూకుడు’కు బ్రేక్‌

విశాఖ జిల్లాలో అసైన్డ్‌ సేకరణ జీవో నిలిపివేత

నిబంధనల ప్రకారం జరగడం లేదు: హైకోర్టు

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూముల్ని సమీకరించి ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న ప్రభుత్వ యత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ఆయా భూములను ఇళ్ల పట్టాల పంపిణీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి 25వ తేదీన జారీ చేసిన జీవో నెంబరు 72ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. భూ సమీకరణలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఏపీ మెట్రోపాలిటన్‌ రీజన్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీస్‌ చట్టం-2016, భూసేకరణ చట్ట నిబంధనలకు ప్రభుత్వ ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. విశాఖ డివిజన్‌లోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖపట్నం రూరల్‌, అనకాపల్లి మండలాల్లోని 6116.50 ఎకరాల అసైన్డ్‌ భూముల్ని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద సమీకరించి ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి 25వ తేదీన జీవో నెంబరు 72 జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ ‘భూసేకరణ ల్యాండ్‌ పూలింగ్‌ రైతు కూలీ నిర్వాసితుల సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు శ్రీరాం, లోకనాథం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12వ తేదీన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘భూములు సమీకరించేటప్పుడు 30 రోజుల ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. అధికారులు ఈ నిబంధనలేవీ పాటించలేదు’’ అని తెలిపారు. ఆ  రిజర్వు చేసిన తీర్పును ధర్మాసనం సోమవారం వెల్లడించింది. పిటిషనర్‌ తరఫు వాదనలతో ఏకీభవించింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసైన్డ్‌ భూముల్ని స్వాధీనం చేసుకోరాదని తేల్చి చెప్పింది.

Updated Date - 2020-03-24T08:43:31+05:30 IST