స్వచ్ఛందంగా విక్రయిస్తేనే కొన్నారు
ABN , First Publish Date - 2020-12-03T08:57:59+05:30 IST
అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

రాజధానిలో భూములు కొనడమే తప్పా?
హైకోర్టులో సీనియర్ న్యాయవాది లూథ్రా
కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ సహా కుట్ర
అడ్వకేట్ జనర ల్ శ్రీరాం వివరణ
రాజధాని భూములపై తీర్పు రిజర్వ్
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ తీర్పును రిజర్వు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఆయా భూముల కొనుగోళ్ల పత్రాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించారు. భూకొనుగోళ్లకు సంబంధించి తమపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అభ్యర్ధిస్తూ కిలారు రాజేశ్, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి, గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ పీవీ రాఘవ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై బుధవారం మరోసారి విచారణ జరిగింది. కిలారు రాజేష్ తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ ్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ‘‘రాజధాని ప్రాంతం 8 వేల చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. దీనిలో క్యాపిటల్ సిటీ రీజియన్ 217 చ.కి.మీ.లో ఉంది.
పిటిషనర్లు క్యాపిటల్ సిటీ రీజియన్‌కి బయటే భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడమే తప్పంటే ఎలా? అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని 2014 నుంచే ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొనుగోళ్లలో నేరపూరిత కుట్ర ఉందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవు. భూయజమానులు స్వచ్ఛందంగా అమ్మకానికి పెడితేనే భూముల కొనుగోళ్లు జరిగాయి. యజమానులు భూములు విక్రయించాక వాటికి ధరలు పెరిగిన తరువాత.. తమను మభ్యపెట్టి కొనుగోలు చేశారంటూ కేసులు పెడితే ఇక రిజిస్ట్రేషన్ చట్టాలకు, సివిల్ కోర్టులకు విలువేముంది? అందువల్ల పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయండి’’ అని అభ్యర్థించారు. నార్త్ ఫేస్ హోల్డింగ్స్ డైరెక్టర్ల తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతానికి 8 కిలోమీటర్ల ఆవల భూములు కొనడాన్ని కూడా తప్పుబడుతున్నారని తెలిపారు.తాము భూముల కొనుగోలు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని లలిత ఆసుపత్రి న్యాయవాది ఏకే కిశోర్‌రెడ్డి పేర్కొన్నారు.
కొనుగోళ్లలో కుట్రకోణం: ఏజీ
సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ‘‘అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కుట్రకోణం దాగి ఉంది. కొంతమంది ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి పిటిషనర్లు భూముల కొనుగోలులో అనైతికంగా లబ్ధిపొందారు. సీఐడీ ప్రాథమిక విచారణలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. భూములు కొనుగోలు చేసేందుకు అమెరికా నుంచి కూడా నిధులు వచ్చిన్నట్లు తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. దర్యాప్తును కొనసాగించేలా ఆదేశించండి’’ అని అభ్యర్థించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రైవేటు భూకొనుగోళ్ల లావాదేవీలను నేరపరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ భూముల కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టమేముందని అడిగారు. ఏజీ బదులిస్తూ..నేరపూరిత కుట్ర ఉండడం వల్లనే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకే ఫిర్యాదు చేశామని ఫిర్యాదుదారు తరఫున ఒ. కైలా్సనాథ్రెడ్డి తెలిపారు.