ఆ పోస్టులను తొలగించండి

ABN , First Publish Date - 2020-10-07T09:57:04+05:30 IST

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది పెట్టిన పోస్టింగులను చట్టప్రకారం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు హైకోర్టు

ఆ పోస్టులను తొలగించండి

చట్టప్రకారం వాటి విషయంలో చర్యలు

సోషల్‌ మీడియాకు హైకోర్టు స్పష్టీకరణ

హైకోర్టు, న్యాయమూర్తులపై  దూషణల కేసులో ధర్మాసనం ఉత్తర్వులు


అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది పెట్టిన పోస్టింగులను చట్టప్రకారం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పోస్టింగులకు సంబంధించిన వివరాలను ఆయా సంస్థలకు అందజేయాలని సీఐడీని ఆదేశించింది. అదేవిధంగా గతంలో హైకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్‌ సవరణకు సంబంధించి తాజాగా వేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారంలోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాంను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


వివిధ తీర్పుల అనంతరం న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల కొంతమంది చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఫిర్యాదుచేసినా సీఐడీ పట్టించుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ గతంలో హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం మరోసారి ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ, ప్రధాన అఫిడవిట్‌లో కొన్ని అంశాలను చేర్చాల్సి ఉందని, ఆ మేరకు దాని సవరణ కోసం అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు దాఖలుచేసిన అఫిడవిట్‌ ఆలస్యంగా అందిందని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కోరారు. సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి అదనపు కౌంటర్‌ దాఖలు చేశామన్నారు.


ఆ కుట్ర ప్రభుత్వానిదే: మురళీధర్‌రావ్‌

టీడీపీ నేత ఎం.శివానందరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావ్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టుపై కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ కేసులో కోర్టుకు మరిన్ని వివరాలు అందించేందుకు, వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్‌ వేయడానికి అనుమతించాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ..ఆ వివరాలు దర్యాప్తు సంస్థకు అందించాలని సూచించింది. ఇందుకు మురళీధర్‌రావ్‌ సమాధానమిస్తూ..రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు వ్యతిరేకంగా ఈ కుట్రకు పాల్పడిందన్నారు. దీనివల్ల ప్రభుత్వం కింద పనిచేసే దర్యాప్తు సంస్థలకు వివరాలు అందించడంవల్ల ఉపయోగం లేదని పేర్కొన్నారు.  


 ఏం చర్యలు తీసుకున్నారు? : ధర్మాసనం

సామాజిక మాధ్యమ సంస్థల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ...ఆయా పోస్టింగులను తొలగించేలా తమ పిటిషనర్లకు సూచిస్తామని హామీ ఇచ్చారు. సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాలు ఆయా పోస్టింగులను తొలగించేలా తాము తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. సామాజికమాధ్యమ సంస్థల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహిత్గీ, హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య, అభిషేక్‌ సింగ్‌, రవిచంద్ర, మృణాల్‌ శంకర్‌ తదితరులు హాజరయ్యారు. కాగా, హైకోర్టులో రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టులు, జడ్జీలపై పోస్టుల వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను తన పిటిషన్‌లో పొందుపరిచింది. 

Updated Date - 2020-10-07T09:57:04+05:30 IST