-
-
Home » Andhra Pradesh » High Court
-
సీల్డ్ కవర్లో ఇవ్వండి
ABN , First Publish Date - 2020-10-07T09:40:09+05:30 IST
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన ఫైళ్లను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు ఆదేశం
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుపై వివరించండి
అకౌంటెంట్ జనరల్‌ను ప్రతివాదిగా చేరుస్తూ నోటీసులు
‘రాజధాని అంశం’ నుంచి మరికొన్ని పిటిషన్ల తొలగింపు
అనుబంధ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభం
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన ఫైళ్లను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాజధాని అంశం’లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంశాల వారీగా వర్గీకరించిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపింది. ‘సీఎం క్యాంపు ఆఫీసు’కు సంబంధించిన వివరాలు అందించాలని, రాష్ట్ర కార్పొరేషన్ కార్యాలయాల వ్యవహారంపైనా కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరాంను ఆదేశించింది. ఈ అంశాలపై ఈ నెల 9న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అదేవిధంగా అకౌంటెంట్ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. ఆ మేరకు నోటీసులు జారీచేస్తూ, పది రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల నోటిఫికేషన్ల అమలును అడ్డుకోవాలంటూ దాఖలైన 17 అనుబంధ పిటిషన్లతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్, సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం తరలించరాదని పేర్కొంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇప్పటికే యధాతథ స్థితి(స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేసినందున వాటిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు ఇరు తరఫు న్యాయవాదులు సమ్మతించారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు లీజు నగదు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రత్యేకంగా విచారణ జరుపుతామని తెలిపింది. అదేవిధంగా భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఒప్పందంలో పేర్కొన్న ప్రభుత్వం.. దానిని ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్లపైనా ప్రత్యేకంగా విచారణ చేపడతామని పేర్కొంటూ వాటిని రాజధాని పిటిషన్ల జాబితా నుంచి తప్పించింది. కాగా, బోస్టన్ కన్సల్టెన్సీ, నిపుణుల కమిటీల ఏర్పాటు, అవి రూపొందించిన నివేదికలను నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలోని అనుబంధ పిటిషన్ల విచారణ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఆ ఫైళ్లను పరిశీలన కోసం కోర్టు ముందుంచుతామని తెలిపారు. బిల్లులకు సంబంధించిన ‘బ్లూ కాపీ’, రిజిస్టర్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. సభలో జరిగిన ప్రక్రియను కోర్టు పరిశీలించాలన్న అభ్యర్థనతో ఆ ఫుటేజీని సమర్పించాలని కోరామని, ఆ వ్యవహారంలో ఎలా తారుమారవుతుందో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇందుకు ఏజీ అభ్యంతరం తెలిపారు. శాసనకర్తల పట్ల న్యాయస్థానంలో అలా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు. ఈ వ్యవహారంలో ముందు రాష్ట్రప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి కౌంటర్ వేయాలని, దానిపై 9న విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
క్యాంప్ ఆఫీసు ఎక్కడైనా ఉండొచ్చు: ఏజీ
సీఎం క్యాంప్ ఆఫీసు రాజధాని పరిధిలోనే ఉండలని ఎక్కడా లేదని, దాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కడకు వెళ్లవచ్చని తెలిపారు. పాలనా వికేంద్రీకరణ చట్ట ప్రకారం ఈ కార్యాలయం తరలింపుపై ఎలాంటి నిషేధం లేదని, దీనికీ యథాతథ స్థితి ఉత్తర్వులు వర్తింపజేయడం సరికాదన్నారు. అయితే అవసరం లేకున్నా నిర్మించిన దాన్ని కూడా క్యాంప్ ఆఫీసుగా భావించాలా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. తాము 15-20 రోజుల పాటు ఉండే భవనం గురించి మాట్లాడ్డం లేదని స్పష్టం చేసింది. సీఎం కోసం ఇతర ఆఫీసులేమైనా నిర్మించారా? అని ప్రశ్నించింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. సీఎం ఆఫీసు రాష్ట్రంలో మరెక్కడా ఉండకూడదన్నట్లుగా పిటిషనర్ల వ్యవహారం ఉందని, వారి అభ్యర్థన సరి కాదన్నారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసు రాజధాని పరిధిలో లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం నివాసం, క్యాంప్ కార్యాలయం ఒక్కటిగానే ఉన్నాయని, ఇతర వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని, ఆ మేరకు కౌంటర్లు దాఖలు చేస్తానని అభ్యర్థించారు.
రాజధాని మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. రాజధానిలో అభివృద్ధి పనులన్నింటినీ ప్రభుత్వం నిలిపేసిందని, తద్వారా ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉత్తర్వులను ధర్మాసనం వాయిదా వేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది ఇంప్లీడ్ పిటిషన్లకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. వారి తరఫున న్యాయవాదులు వీఆర్ రెడ్డి, వై.నాగిరెడ్డి, ఎం.చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అయితే అమరావతి ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా ఉందన్నారు. కాగా పూర్తి విచారణకు సమయం మించిపోవడంతో తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.
‘జగన్ మీడియా’పై హైకోర్టు అసంతృప్తి
సుప్రీంకోర్టు గురించి తాము పేర్కొన్నట్లుగా జగన్ మీడియా ప్రచురించిన వ్యాఖ్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణలో లేనివాటిని ప్రచురించడం సరికాదని ఏజీ దృష్టి కి తీసుకొచ్చింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. ఆ వార్తను పరిశీలిస్తానని, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాది వై.నాగిరెడ్డి స్పందిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ‘ఆంధ్రజ్యోతి’ అస త్య కథనం ప్రచురించిందని, న్యాయస్థానానికి సంబంధించిన వార్తలు మీడియాలో తప్పుగా వస్తున్నాయని తెలిపారు. అయితే ఫోన్ ట్యాపిం గ్ వ్యవహారం పెండింగ్‌లో ఉన్నందున తాము స్పందించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.