ఇది ఖాకీస్టోక్రసీనా!

ABN , First Publish Date - 2020-09-12T08:45:29+05:30 IST

‘‘చట్టాల ఉల్లంఘన నుంచి ప్రజలను కాపాడటమే పోలీసుల ప్రధాన విధి. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ... దానితో సంబంధం లేకుం డా పని చేయాలి.

ఇది ఖాకీస్టోక్రసీనా!

  • ప్రజల్లో అలాంటి భావన కల్పిస్తున్నారు: హైకోర్టు
  • సీఐడీ-పోలీసులపై ఆగ్రహం
  • నిరాధార కేసులు, వేధింపులు.. అరాచకానికి బాటలు
  • పోలీసులున్నది ప్రజలను కాపాడేందుకే!
  • అధికార పార్టీ కోసం  అత్యుత్సాహమా?
  • పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలి
  • యూట్యూబ్‌ చానల్‌ అధిపతిపై సీఐడీ కేసు రద్దు


అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘చట్టాల ఉల్లంఘన నుంచి ప్రజలను కాపాడటమే పోలీసుల ప్రధాన విధి. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ... దానితో సంబంధం లేకుం డా పని చేయాలి. తగిన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు పేరుతో బాధితులను వేధింపులకు గురి చేయడం అరాచకత్వానికి దారి తీస్తుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్యలతో తాము ‘ఖాకీస్టోక్రసీ’ (దారుణమైన పాలన/సైనిక పాలన)లో ఉన్నామనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారని ఆగ్రహించింది. ఒక యూట్యూబ్‌ చానల్‌ అధిపతిపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా ఆ చానల్‌ అభ్యంతరకర వార్త ప్రసారం చేసిందంటూ పి.జగదీశ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీసులు ఏప్రిల్‌ 29వ తేదీన ఐపీసీ 188, 505(2), 506, విపత్తుల నిర్వహణా చట్టంలోని సెక్షన్‌ 54 కింద కేసు నమోదు చేశారు. ఆ కేసును రద్దు చేయాలని అభ్యర్థిస్తూ ఆ చానల్‌ ఎండీ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెల్లడించారు.  ఈ వ్యవహారంలో కేసు నమోదు, దర్యాప్తు తీరుతోపాటు... సదరు చానల్‌కు చెందిన ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలను  స్వాధీనం చేసుకున్న విధానాన్ని పరిశీలిస్తే అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తిపరిచేందుకే చేసినట్లుందని, ఇది తప్ప వేరొకటి కాదని జడ్జి తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పార్టీలు అధికారంలోకి రావచ్చు. కొంతకాలానికి పోవచ్చు.  అయితే,  అధికారులు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పని చేయాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ... చట్టం పట్ల కనీస అవగాహన, శాఖపై పాలనాపరమైన నియంత్రణ లేని అధికారుల వల్ల  ఖాకీస్టోక్రసీలో జీవిస్తున్నామనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారు’’ అని ఆగ్రహించారు. ఇలాంటి  వారి చర్యలను నియంత్రించని పక్షంలో... ప్రజలకు జీవించే హక్కు, వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలుగుతాయని  పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారి నుంచి ప్రజలను రక్షించడమే  సీఐడీ, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల ప్రధాన విధి అని గుర్తు చేశారు. 


ఈ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ‘‘ఆ చానల్‌లో  ప్రసారమైన అంశం... రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, శత్రుత్వ భావన పెంచేలా ఉందని ఫిర్యాదులోనే లేదు. అలాంటప్పుడు సెక్షన్‌  505(2) కింద ఎలా కేసు నమోదు చేశారు?’’ అని నిలదీశారు. సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి... పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఇది చట్ట విరుద్ధమని, ఏకపక్షమని ఆక్షేపించారు. పిటిషనర్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, స్వాధీనం చేసుకున్న సామగ్రిని కూడా వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2020-09-12T08:45:29+05:30 IST