‘ప్రకాశం’ స్థలాలపై కౌంటర్‌ వేయండి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-01T09:54:05+05:30 IST

ప్రకాశం జిల్లా సర్వేరెడ్డిపాలెం, ఎర్రజెర్ల, కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల పరిధిలో మైనింగ్‌

‘ప్రకాశం’ స్థలాలపై కౌంటర్‌ వేయండి: హైకోర్టు

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సర్వేరెడ్డిపాలెం, ఎర్రజెర్ల, కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల పరిధిలో మైనింగ్‌ కోసం ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన పిల్‌పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఇదే అంశంపై పిటిషనర్‌ తండ్రి పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు నుంచి సానుకూల స్పందన రాలేదని, దీంతో కొడుకు పిల్‌ దాఖలు చేశారని తెలిపారు. అయితే, గతంలో పిటిషన్‌ వేసిన వ్యక్తికి, ప్రస్తుత పిటిషనర్‌ శ్రీనివాసులుకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. 


వినియోగదారుల కమిషన్‌ పోస్టుల భర్తీపై వివరాలివ్వండి: హైకోర్టు 

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల పదవులను భర్తీ చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. కమిషన్‌లో ఉన్న అన్ని పదవుల భర్తీకి సంబంధించి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్‌తో పాటు జిల్లా కమిషన్లలో ఖాళీగా ఉన్న చైర్మన్లు, సభ్యుల పదవులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది చలసాని అజయ్‌కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిల్‌పై శుక్రవారం ధర్మాసనం ముందు విచారణ  జరిగింది.

Updated Date - 2020-08-01T09:54:05+05:30 IST