-
-
Home » Andhra Pradesh » High alert in nandhyala
-
నంద్యాలలో హై అలర్ట్
ABN , First Publish Date - 2020-04-07T12:56:19+05:30 IST
నంద్యాలలో హై అలర్ట్

- కరోనా పాజిటివ్ కేసులతో కలకలం
- 48 గంటల కర్ఫ్యూ ప్రారంభం
నంద్యాల: నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 చేరడంతో నంద్యాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నంద్యాల పట్టణం, మండలంలోని రెండు, మూడు గ్రామాల నుంచి, గోస్పాడు మండలంలోని రెండు, మూడు గ్రామాల నుంచి ముస్లింలు మర్కజ్‌కు వెళ్లివచ్చారు. వీరిని అధికారులు గుర్తించి క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. రక్త నమూనాలను అనంతపురం, తిరుపతికి పంపారు. కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాల నుంచి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారు దాదాపు 100 మంది ఉంటారని అంచనా. అధికారులు మాత్రం ఎంతమంది వెళ్ళి వచ్చారన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో రాత్రికి రాత్రే కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలు ఆత్మకూరు బస్టాండ్, చాంద్‌బాడ, దేవనగర్, వీసీ కాలనీ, గుడిపాటిగడ్డ, ఖాజీవీధి, మదార్‌పేట, ముల్లాన్‌పేట, నీలివీధి, పార్క్ రోడ్డు, సలీంనగర్, మండలంలోని అయ్యలూరు గ్రామాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. 48 గంటల పాటు నిర్భంధ కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలను నేరుగా ఇళ్ళ వద్దకే చేర్చేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ అమలుకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా రెడ్‌జోన్ పరిధిలో ఉన్న కాలనీవాసులు తమ వీధుల్లోని ఇతరులు రాకుండా మోటార్ సైకిళ్లు, జీపులు, ఆటోలు, డ్రమ్ములు, చెట్ల మొదళ్లను రోడ్డుకు అడ్డంగా వేశారు. కోడుమూరు పట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యాయారు. కోడుమూరును కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి పట్టణంలో మూడు కిలోమీటర్లు మెడికల్ షాపులు మినహా అన్ని రకాల షాపులను మూసివేయించారు. ఆయా వీధుల్లో ప్రజలు కంప చెట్లను అడ్డుపెట్టి ఎవ్వరు తిరగకుండా రహదారులను మూసివేశారు. ఈ ముగ్గురు ఇటీవల ఢిల్లీకి వెళ్లి రావడం.. వీరిలో కరోనా పాజిటివ్ బయట పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా సోకిన ముగ్గురితో ఇటీవల ఎవరెవరు సన్నిహితంగా తిరిగారనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయా వీధుల్లో సోమవారం ఉదయం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు.