మాకు ఆ ఖర్మ పట్టలేదు: హెరిటేజ్

ABN , First Publish Date - 2020-12-06T09:00:35+05:30 IST

‘‘ఆరంభం నుంచి కచ్చితమైన నైతిక ప్రమాణాలతో పనిచేస్తున్నాం. షేర్ల ధరల రిగ్గింగ్‌ ఖర్మ మాకు పట్టలేదు. మేం మా శక్తిపైనే పెరిగాం

మాకు ఆ ఖర్మ పట్టలేదు: హెరిటేజ్

ఆది నుంచీ నైతిక ప్రమాణాలతో పనిచేస్తున్నాం

షేర్ల ధరల రిగ్గింగ్‌ ఆరోపణలపై హెరిటేజ్‌


అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఆరంభం నుంచి కచ్చితమైన నైతిక ప్రమాణాలతో పనిచేస్తున్నాం. షేర్ల ధరల రిగ్గింగ్‌ ఖర్మ మాకు పట్టలేదు. మేం మా శక్తిపైనే పెరిగాం తప్ప ప్రభుత్వాల నుంచి ప్రయోజనాలు పొందడం ద్వారా పెరగలేదు. హెరిటేజ్‌పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం సరికాదు. సంస్థ పాల విక్రయాలపై ఆధారపడిన లక్షలాది రైతు కుటుంబాల, పంపిణీ ఏజెంట్ల, ఉద్యోగుల, రవాణా సంస్థల, వాటాదారుల ప్రయోజనాలను అది దెబ్బ తీస్తుంది. వ్యాపార రంగంలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడే మా సంస్థ పనిచేస్తుందని హామీ ఇస్తున్నాం’’ అని హెరిటేజ్‌ సంస్థ అధ్యక్షుడు సాంబశివరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ అసెంబ్లీలో సంస్థపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలను ఆ కంపెనీ పనితీరును బట్టి పెట్టుబడి పెట్టేవారు అంచనా వేసుకొంటారు. అలాగే అప్పటి మార్కెట్‌ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. భారత స్టాక్‌ మార్కెట్లలో షేర్ల ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంస్థలు నిశితంగా పరిశీలిస్తుంటాయి. ఇష్టానుసారం వాటిని రిగ్గింగ్‌ చేయడం, మార్చేయడం సాధ్యం కాదు’’ అని తెలిపారు. 

Read more