-
-
Home » Andhra Pradesh » HEALTH SURVEY AGAIN
-
మరోసారి ఆరోగ్య సర్వే!
ABN , First Publish Date - 2020-03-25T07:52:08+05:30 IST
రోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యంపై సమగ్ర సర్వేను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గురువారంలోగా...

- రేపటిలోగా పూర్తి.. ఇంటింటికీ వచ్చి వివరాల సేకరణ
- విదేశాల నుంచి వచ్చిన వారి నమోదు
- ఇళ్లలోనే ఉండి సర్వేకు సహకరించండి
- ‘లాక్‌డౌన్’ పూర్తిగా పాటించండి
- ముఖ్యమంత్రి జగన్ పిలుపు
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యంపై సమగ్ర సర్వేను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గురువారంలోగా ఈ సర్వే పూర్తి చేస్తారని తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలను సేకరిస్తారన్నారు. సర్వే సక్రమంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా... కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కోవిడ్-19పై మంగళవారం రాత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారితోపాటు మొత్తం ప్రజలందరి ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని జగన్ చెప్పారు. దీనికోసం మరోదఫా వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో కలసి సర్వే చేయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సర్వే అనంతరం పూర్తి వివరాలను ప్రతి రోజూ అప్‌డేట్ చేయాలన్నారు. ఈ సమగ్ర సర్వే సమాచారం భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రజలంతా లాక్‌డౌన్ పాటించి ఇళ్లలోనే ఉంటే... సర్వేకు సహకరించిన వారవుతారన్నారు. కోవిడ్-19ను నిరోధించేందుకు ప్రజా సహకారం అవసరమని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ రాష్ట్రంలో పాజిటివ్‌గా నమోదయిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే. ఈ వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండాలంటే .. వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్‌కు వెళ్లాలి’’ అని సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖియా రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల వ్యవస్థ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.