జీవో ఇచ్చారు.. మరి ఆరోగ్యభత్యమేదీ?

ABN , First Publish Date - 2020-03-02T07:42:15+05:30 IST

ప్రజారోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను ఆరోగ్యభత్యం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్యభత్యాన్ని ఘనంగా ప్రకటించిన ప్రభత్వుం దానికి సంబంధించిన జీవో...

జీవో ఇచ్చారు.. మరి ఆరోగ్యభత్యమేదీ?

  • ఆరు నెలలైనా మంజూరు కాని వైనం


  • విన్నపాలు పట్టించుకోని పురపాలకశాఖ
  • కొన్ని పట్టణాల్లో మాత్రం మంజూరు
  • ఎందుకిచ్చారంటూ అధికారులకు తాఖీదులు
  • రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యకార్మికుల ఆందోళన
  • ‘చలో అమరావతి’కి సన్నద్ధం

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను ఆరోగ్యభత్యం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్యభత్యాన్ని ఘనంగా ప్రకటించిన ప్రభత్వుం దానికి సంబంధించిన జీవో విడుదల చేసి ఆరు నెలలైంది. కానీ.. నేటికీ వారికి అది అందనేలేదు. దీంతో వారు ఆందోళన బాటపట్టారు. పారిశుధ్య కార్మికులు విధి నిర్వహణలో భాగంగా నిత్యం అపరిశుభ్ర, అనారోగ్యకర వాతావరణంలో పని చేయాలి. దాని వల్ల వారికి ఎదురయ్యే వివిధ రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఒక్కొక్కరికి నెలకు రూ.6,000 చొప్పున హెల్త్‌ అలవెన్స్‌ (ఆరోగ్యభత్యం) ఇస్తామంటూ పురపాలక శాఖ గతేడాది ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది.


6 నెలలకుపైగా గడిచినా ఇంతవరకూ వారికి ఈ భత్యం అందలేదు. రాష్ట్రంలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని మొత్తం సుమారు 50,000 మంది పారిశుధ్య కార్మికులకు నిరాశే మిగిలింది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు ఆ శాఖ డైరెక్టర్‌ జేఎస్సార్కేఆర్‌ విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన కరువైంది. కొందరు బాధ్యత కలిగిన ఉన్నతాధికారులైతే ‘ఇస్తున్నారనుకున్నామే... ఇవ్వడం లేదా, చూద్దాం లే..’ అని చెప్పి దాటవేస్తున్నారు. 


ఇచ్చిన వారికి వాత..!

మరొకపక్క.. రాష్ట్రంలోని మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల ఆరోగ్య భత్యాన్ని ఒకట్రెండు నెలలపాటు చెల్లించారు. అయితే దాన్ని తప్పుబడుతూ సంబంధిత అధికారులకు ఉన్నతాధికారులు తాఖీదులు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్యభత్యాన్ని ఇస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ నెలకు రూ.12,000 వేతనం పొందుతున్న వారందరికీ హెల్త్‌ అలవెన్స్‌గా ఒక్కొక్కరికి నెలకు రూ.6,000 అదనంగా ఇస్తామని చెప్పారు. దీంతో పారిశుధ్య కార్మికులు సంబరపడ్డారు.


సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల తర్వాత పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఆ నెల నుంచే తమ వేతనాలతో కలిపి, ఆరోగ్య భత్యం కూడా మంజూరవుతుందని కార్మికులు ఆశపడ్డారు. కానీ ఇంతవరకూ దాని జాడే లేదు! ఇదే సమయంలో ఈ అలవెన్స్‌ను పట్టణ స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ట్రాక్టర్ల సిబ్బందితోపాటు ఇతర అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తారన్న వార్తలు రావడంతో వారు కూడా సంతోషించారు. వారికీ నిరాశ తప్పలేదు.


రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..

అధికారిక ఉత్తర్వులను అనుసరించి పట్టణ స్థా నిక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ హెల్త్‌ అలవెన్స్‌ను ఇన్నాళ్ల బకాయితో సహా చెల్లించాలన్న డిమాండ్‌తో కొన్ని రోజులుగా కార్మికులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. సాంకేతిక సమస్యల నెపంతో కాలక్షేపం మాని, ఇకనైనా పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆరోగ్య భత్యాన్ని కార్మికులకు అరియర్లతో సహా చెల్లించాలని, లేని పక్షంలో త్వరలోనే ‘చలో అమరావతి’ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ ఆందోళనల్లో భాగమైన ఏఐటీయూసీ నేత నెక్కంటి సుబ్బారావు తెలిపారు.


Updated Date - 2020-03-02T07:42:15+05:30 IST