రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-09-06T17:46:48+05:30 IST

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది: బుద్దా వెంకన్న

విజయవాడ: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తన కుటుంబంలో 11 మంది కరోనా భారిన పడి కోలుకున్నారని చెప్పారు. వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తే మరి సామన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం మీద చూపిన శ్రద్ధ.. కరోనా బాధితుల మీద చూపించడం లేదని ఆరోపించారు.


ఇప్పటికైనా అన్న క్యాంటీన్లు తెరిచి, పౌష్టికాహారం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని బుద్దా వెంకన్న సూచించారు. ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెలుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో పరిస్థితిని ఊహించుకుంటే భయానకంగా ఉందన్నారు. కరోనా బాధితుల కోసం ఖాళీగా ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, కళ్యాణ మండపాలు, స్టేడియంలు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందించాలని, కరోనా బాధితులకు రూ.2 వేలు కొనసాగించాలన్నారు. ప్రజలు ఇంతటి ఆపదలో ఉంటే నిస్సిగ్గుగా పన్నులు, చార్జీలు పెంచటం వంచన కాదా? అని ప్రశ్నించారు. మండల స్థాయిలోనూ కరోనా వైద్య పరీక్షలు, వైద్యం ఉచితంగా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-06T17:46:48+05:30 IST