సామాన్యులపై వేధింపులు రాజ్యాంగానికే అవమానం

ABN , First Publish Date - 2020-11-27T09:14:26+05:30 IST

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రంలో సామాన్యులను, బడుగు బలహీన వర్గాలను వేధింపులకు గురి చేయడం రాజ్యాంగానికే అవమానమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సామాన్యులపై వేధింపులు రాజ్యాంగానికే అవమానం

 చంద్రబాబు


అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రంలో సామాన్యులను, బడుగు బలహీన వర్గాలను వేధింపులకు గురి చేయడం రాజ్యాంగానికే అవమానమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలోని పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసుల నమోదు, రైతులకు బేడీలు వేయడం, పాలకుల వేధింపులు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలు, మహిళలపై సామూహిక అత్యాచారాలు, ప్రతిపక్షాల అణిచివేతవంటి చర్యలు పెట్రేగడం గర్హనీయం. ప్రశ్నించే గొంతును నులిమేయడం, మీడియాలపై ఆంక్షలు... దాడులు, ప్రాధమిక హక్కులను కాలరాయడం, తప్పులు కేసులు, అక్రమ నిర్బంధాలు వంటి దుశ్చర్యలకు మన రాష్ట్రం వేదిక కావడం బాధాకరం.


రాజ్యాంగ రచయతల ఆశయాలు, ఆకాంక్షలను తుంగలో తొక్కే పెడ ధోరణులను ప్రతి ఒక్కరూ నిరసించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా, రాజ్యాంగ దినోత్సవాన్ని వైసీపీ చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ రాజ్యాంగ దినోత్సవం చేసే హక్కు వైసీపీకి లేదన్నారు. వైసీపీ చేయాల్సింది రాజారెడ్డి రాజ్యాంగ దినోత్సవం అని విమర్శించారు. 


అక్బరుద్దీన్‌ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారు: లోకేశ్‌

మహనీయులు ఎన్టీఆర్‌, పి.వి.నరసింహరావుల సమాధులు కూలుస్తా అని అక్బరుద్దీన్‌ తన వ్యకి ్తత్వాన్ని కూల్చేసుకున్నారని టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చేబదులు మీలో ఉన్న అహాన్ని కూలిస్తే మిమ్మల్ని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మీకు ఓట్లు వేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుంది’’ అని గురువారం లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Read more