గుంటూరులో గుట్కా మాఫియా గుట్టు రట్టు చేసిన ‘వార్’

ABN , First Publish Date - 2020-09-05T17:38:42+05:30 IST

ఒకరు గుట్కా మాఫీయా డాన్... మరోకరు కొత్తగా గుట్కా వ్యాపారంలోకి వచ్చిన అధికార పార్టీ నేత. అధికారం అండతో తమ బ్రాండ్ గుట్కాలనే అమ్మాలని చిరు వ్యాపారులపై బెదిరింపులు.

గుంటూరులో గుట్కా మాఫియా గుట్టు రట్టు చేసిన ‘వార్’

ఒకరు గుట్కా మాఫీయా డాన్... మరోకరు కొత్తగా గుట్కా వ్యాపారంలోకి వచ్చిన అధికార పార్టీ నేత. అధికారం అండతో తమ బ్రాండ్ గుట్కాలనే అమ్మాలని చిరు వ్యాపారులపై బెదిరింపులు. బెదిరింపుల నేపథ్యంలో గుట్కా డాన్ అధికార పార్టీ నేతపై కన్నెర్ర చేశారు. ఇద్దరు వ్యాపారులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదుల చేసుకునే వరకు వెళ్ళింది. గుట్కా మాఫీయా మద్య వార్ పోలీసులకు వరంగా మారింది. గుంటూరు జిల్లాలో గుట్కా మాఫీయా మద్య వార్ పై ఏబిన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


గుంటూరు జిల్లా లో గుట్కా మాఫీయా మద్య వార్ కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ మాఫియా మధ్య వార్‌తో గుట్కా మాఫియా సామ్రాజ్యం గుట్టు బట్టబయలు అయ్యింది. గుట్కా మాఫియా వార్ పోలీసులకు వరంగా మారుతుంది. గుంటూరుకు చెందిన బొలిశెట్టి కామేశ్వరరావు గత కొన్నేళ్ళుగా గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. గుట్కా వ్యాపారంలో కామేశ్వరరావు అలియాస్ కామేష్ కింగ్ గా ఎదిగాడు. పలు రాజకీయ పార్టీల నేతలతో కామేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక పోలీసు శాఖలో కూడా పలు స్థాయిలలో అధికారులతో కామేష్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. పోలీసులకు మామూలు, రాజకీయ నేతలతో సత్సంబంధాలతో కామేష్ గుట్కా సామ్రాజ్యానికి కింగ్ గా ఎదిగాడు. గుట్కా మాఫియా డాన్ గా ప్రచారంలో ఉన్న కామేష్‌కు ఇప్పటి వరకు ఎదురు లేకుండా పోవడంతో ఎలాంటి ఆటంకం లేకుండా తన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయాలుగా చేశాడు. 


తన పలుకుబడితో ఎస్పీనే...

ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా వైసిపి నేత రూపంలో కామేష్ కు పోటీ వచ్చింది. గుంటూరు నగరానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా సన్నిహితులు కొత్తగా గుట్కా వ్యాపారంలోకి అడుగు పెట్టారు. పెదకాకాని సమీపంలోని కొప్పురావూరులోని ఓ గోడౌన్ లో గుట్కాను తయారు చేయడం ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తమ బ్రాండ్ గుట్కా లనే అమ్మాలని వైసిపి ఎమ్మెల్యే సన్నిహితులు చిరు వ్యాపారులపై ఒత్తిడి చేశారు. అధికారం అండతో కొంత మంది పోలీసులను అడ్డుపెట్టుకొని చిరు వ్యాపారులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో పోలీసులు ఒత్తిడి తట్టుకోలేని చిరు వ్యాపారులు వైసిపి నేత సన్నిహితుల బ్రాండ్ అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటి వరకు అమ్ముతున్న తన బ్రాండ్ గుట్కాకు నష్టం వాటిల్లుతుందని కామేశ్వరరావు కన్నెర్ర చేశారు. నేరుగా కామేశ్వరరావు రంగంలోకి దిగి తనకు ఉన్న పలుకుబడి, పరిచయాలతో నేరుగా ఎస్పీ ద్వారా అధికార పార్టీ నేత గోడౌన్ పై దాడులు చేశారు. గుట్కా తయారీ యంత్రాలను సీజ్ చేశారు. 


ఎస్పీ తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే..

నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగి దాడులు చేయడంపై వైసిపి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వ్యాపారాలపైనే దాడులు చేయడం ఏంటని పార్టీ పెద్దల వద్ద ఎమ్మెల్యే పంచాయతీ పెట్టినట్లు ప్రచారం. తమకు గుట్కా వ్యాపారంలో పోటీగా ఉన్న కామేశ్వరరావు పై కసి తీర్చుకోవాలని ఎమ్మెల్యే కంకంణం కట్టుకున్నాడు. దీంతో పార్టీ  పెద్దల అండతో గుట్కా డాన్ కామేశ్వరరావును టార్గెట్ చేశారు. అనుకుందే తడవుగా గుంటూరు ఆటోనగర్ లోని కామేశ్వరరావు గోడౌన్ లో పోలీసులు దాడి చేసి గుట్కా స్టాక్‌ను పట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు కామేశ్వరరావు గుట్కాను ఎన్నో చోట్ల పోలీసులు పట్టుకున్నా ఎప్పుడూ కామేశ్వరరావు స్టేషన్ మెట్లు ఎక్కిన సందర్భం లేదు. ఫోన్ లోనే పోలీసులతో మాట్లాడి సెటిల్ చేసుకుని తన వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించారు. 


ఎమ్మెల్యే పంతం.. స్టేషన్ మెట్లు ఎక్కిన గుట్కా కింగ్..

తాజాగా వైసిపి ఎమ్మెల్యే పంతంతో గుట్కా డాన్‌గా ఉన్న కామేశ్వరరావును ఎట్టకేలకు స్టేషన్ మెట్లు ఎక్కించారు. తొలిసారిగా కామేశ్వరరావును మీడియా ముందు ప్రవేశ పెట్టి అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి అరెస్ట్ చూపించారు. ఇప్పటి వరకు కామేశ్వరరావు పై తెలుగు రాష్ట్రాలతో 200 వరకు కేసులు ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఈ నేపద్యంలో కామేశ్వరరావు పై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపుతానని స్పష్టం చేశారు. అదేవిధంగా గుట్కా అమ్మకాలు చేసే వారిపై రౌడీ షీట్ లు ఓపెన్ చేస్తామని కూడా ఎస్పీ ప్రకటించారు. దీంతో గుట్కా వ్యాపారులలో వణుకు మొదలైంది. గుట్కా వ్యాపారంలో డాన్ గా ఎదిగిన కామేశ్వరరావునే అరెస్ట్ చేయడం చిన్నాచితక వ్యాపారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొత్తానికి రెండు గ్రూపుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు పోలీసులకు  వరంగా మారింది. అధికార పార్టీ నేత గుట్కా వ్యాపారంతో పాటు, గుట్కా డాన్ గా ఉన్న కామేశ్వరరావును సైతం కంట్రోల్ చేసే అవకాశం పోలీసులకు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ఈ గుట్కా వ్యాపారం ఇంతటితో ఆగుతుందా లేక మరింతగా పంతాలకు పోతారా అనేది వేచి చూడాలి.

Updated Date - 2020-09-05T17:38:42+05:30 IST