ఆగస్టు 15వ తేదీనైనా పంపిణీ జరిగేనా?

ABN , First Publish Date - 2020-07-08T12:09:52+05:30 IST

ఆగస్టు 15వ తేదీనైనా పంపిణీ జరిగేనా?

ఆగస్టు 15వ తేదీనైనా పంపిణీ జరిగేనా?

మూడో‘సారీ’

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

ఎదురు చూస్తున్న 2,74,461మంది లబ్ధిదారులు


గుంటూరు: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దీంతో లబ్ధిదారుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకొంటున్నాయి. ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోని హైకోర్టు కొట్టివేయడంతో పాటు పలు కారణాలతో వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు లేఅవుట్ల అభివృద్ధి 100శాతం జిల్లాలో పూర్తి కాలేదు. అలానే రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవసరమైన భూములు కూడా ఇంకా సేకరణ జరగలేదు. జిల్లాలో 2,74,461 మంది లబ్ధిదారులను పేదలందరికీ ఇళ్ల పథకానికి రెండు విడతల్లో ఎంపిక చేశారు. తొలుత మార్చినెలలో ఉగాది రోజున ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఇంటి పట్టా విషయంలో దానిని ఎప్పుడైనా అమ్ముకోవచ్చన్న నిబంధనపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్పందించి ఆ జీవోని కొట్టివేసింది.


అలానే అమరావతి రాజధాని నగర పరిధిలో విజయవాడ, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన 26 వేలమంది పేదలకు స్థలాలు పంపిణీ చేసేందుకు మరో జీవో ఇచ్చింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. తాము అమరావతి రాజధాని కోసం మాత్రమే భూములు ఇచ్చామని, ఇళ్ల స్థలాల పంపిణీ కోసం కాదని నివేదించారు. హైకోర్టు రాజధాని రైతుల వాదనతో ఏకీభవించి ఆ జీవోని కూడా కొట్టివేసింది. ఓ వైపు హైకోర్టు ఆదేశాలు, మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజున ఇవ్వాల్సిన ఇళ్లస్థలాలు పంపిణీ కార్యక్రమం తొలి వాయిదా వేసింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో జూలై 8వ తేదీన వైఎస్‌ జయంతి రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపింది.


మొదటి విడతలో 2,39,900 మందిని, రెండో విడతలో 34,561 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. లబ్ధిదారుల కోసం 4,181.96 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటివరకు 4,009.99 ఎకరాల భూమిని సేకరించారు. మరో 172 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉన్నది. ఇదిలావుంటే వైఎస్‌ జయంతి రోజైన ఈ నెల8వ తేదీన ఇంటి పట్టా చేతికందుతుందని లబ్ధిదారులంతా ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. అయితే మూడోసారి కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేయడంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. 


Updated Date - 2020-07-08T12:09:52+05:30 IST