జీఎస్‌డీపీ 12.73 % వృద్ధి

ABN , First Publish Date - 2020-06-16T09:25:36+05:30 IST

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎ్‌సడీపీ 12.73 శాతం పెరిగిందని ప్రణాళికశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

జీఎస్‌డీపీ 12.73 % వృద్ధి

తలసరి ఆదాయం రూ.1,69,519

ఉద్యాన పంటల్లో దేశంలోనే ఫస్ట్‌

అక్షరాస్యతలో వెనుకబాటే

ఉద్యాన పంటల్లో దేశంలోనే ఫస్ట్‌

2019-20 పురోగతిపై ప్రణాళికశాఖ ప్రకటన 


అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీ 12.73 శాతం పెరిగిందని ప్రణాళికశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019-20లో జీఎస్‌డీపీ రూ.9,72,782 కోట్లుగా నమోదైందని, 2018-19లో ఈ విలువ రూ.8,62,957 కోట్లుగా ఉందని పేర్కొంది. అంటే... అంతకుముందు ఏడాది కంటే జీఎస్‌డీపీ  రూ.1.10 లక్షల కోట్లు (12.73 శాతం) పెరిగిందని వివరించింది. 2019-20 కాలంలో వ్యవసాయ రంగం జీఎస్‌డీపీ  రూ.3,20,218 కోట్లు, పారిశ్రామికరంగ జీఎస్‌డీపీ  రూ.1,91,857 కోట్లు, సేవా రంగ జీఎస్‌డీపీ  రూ.3,67,747 కోట్లుగా నమోదైంది.


వ్యవసాయ రంగం జీవీఏ 18.96 శాతం, ఉద్యానరంగం 11.67 శాతం, పశుసంవర్ధకంలో జీవీఏ 4.53 శాతం మేర పెరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక రంగంలో 2011-12 స్థిరధరల ప్రకారం 5.67 శాతం వృద్ధిరేటు, సేవారంగంలో 9.11 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వివరించింది. కాగా 2019-20 కాలానికి ఏపీ తలసరి ఆదాయం అంతకుముందు ఏడాదితో పోల్చితే  రూ.1,51,173 నుంచి రూ.1,69,519కి పెరిగినట్లు ప్రణాళికశాఖ పేర్కొంది.


తలసరి ఆదాయంలో 12.14 శాతం వృద్ధి నమోదైందని, అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 ఉందని వివరించింది. అక్షరాస్యత విషయంలో మాత్రం ఏపీ వెనుకబడే ఉంది. జాతీయ సగటు 72.98 శాతం ఉంటే ఏపీలో 67.35 శాతం మాత్రమే. ఉద్యాన పంటల్లో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉంది. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు, పోషక లోపం తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రణాళికశాఖ వివరించింది. రాష్ట్రంలో 93 శాతానికిపైగా చిన్నారులకు ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపింది.


2019-20లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సైతం ఈ ప్రకటనలో ప్రణాళికశాఖ ప్రస్తావించింది. రాష్ట్రంలో 54 జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 2 ప్రాజెక్టుల మొదటి దశ పనులు పూర్తయ్యాయని ప్రకటించింది. ఇసుక పాలసీ వల్ల సరఫరాలో ఒత్తిడి తగ్గినట్లు పేర్కొంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో విమానసేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ సెజ్‌, రామాయపట్నం పోర్టుల అభివృద్ధి జరుగుతోందని వెల్లడించింది. 

Updated Date - 2020-06-16T09:25:36+05:30 IST