మోసం బ్రదర్‌

ABN , First Publish Date - 2020-03-02T07:29:04+05:30 IST

అది ఒక క్రైస్తవ సొసైటీ. సేవ చేస్తామంటూ ముందుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోసం నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దానికి అనుబంధంగా ఆస్పత్రి నిర్మించి ఉచితంగా వైద్యసేవ చేస్తామని...

మోసం బ్రదర్‌

  • ‘సెయింట్‌ లూక్స్‌’... రూల్స్‌ బ్రేక్స్‌!

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు నర్సింగ్‌ శిక్షణ..
  • ఉచిత వైద్యానికి ఆస్పత్రి కోసం భూమి
  • 11ఏళ్ల క్రితం తీసుకున్న మైనారిటీ సంస్థ
  • 7.35 ఎకరాలు అప్పగించిన ప్రభుత్వం
  • ఎకరా రూ.1.5 కోట్లకు కలెక్టర్‌ సిఫారసు
  • రూ.25 లక్షలకే ఇచ్చిన ప్రభుత్వం 
  • ఆస్పత్రీ లేదు.. ఉచిత సేవా లేదు
  • భూ వినియోగంలో నిబంధనలకు పాతర


విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అది ఒక క్రైస్తవ సొసైటీ. సేవ చేస్తామంటూ ముందుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోసం నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దానికి అనుబంధంగా ఆస్పత్రి నిర్మించి ఉచితంగా వైద్యసేవ చేస్తామని చెప్పింది. ఇందుకు అవసరమైన భూమి కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. సమ్మతించిన సర్కారు 7.35 ఎకరాలను కేటాయించింది.


ఇది 11 ఏళ్ల క్రితం మాట! కట్‌ చేస్తే... రెండు రేకుల షెడ్లు, చిన్న భవనం నిర్మించి వాటిలోనే నర్సింగ్‌ కాలేజీ, వసతి గదులు నిర్వహిస్తోంది. ఇక ఆస్పత్రీ లేదు.. ఉచిత సేవా లేదు! ఎకరం కోట్ల రూపాయల ధర పలుకుతున్న విశాఖ నగరంలో.. సేవ పేరుతో భూములు పొందిన ‘సెయింట్‌ లూక్స్‌’ వ్యవహరిస్తున్న తీరు ఇదీ! భూ వినియోగ నిబంధనలకు పాతరేస్తూ సుమారు ఆరున్నర ఎకరాల స్థలాన్ని ఖాళీగానే ఉంచింది! గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులపై ‘నిబంధనల’ అస్త్రం ప్రయోగిస్తూ వాటి ని రద్దు చేయడానికి ఉత్సాహం చూపుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ సొసైటీవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం! 


గడువు మూడేళ్లే కానీ..: నర్సింగ్‌ శిక్షణ, ఉచిత వైద్యసేవలు అందించడానికి ఆస్పత్రి నిర్మాణాల కోసం సెయింట్‌ లూక్స్‌ మైనార్టీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ 2007లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఎండాడలో సర్వే నంబరు 16/1 సమీపంలోని ఒక ప్రముఖ విద్యా సంస్థకు ఎదురుగా ఉన్న 7.35 ఎకరాల భూమిని 2009లో కేటాయించింది. అప్పట్లో ఎకరా రూ.1.5 కోట్లకు (మార్కెట్‌ ధర రూ.7 కోట్లు ఉండేది) ఇవ్వాలని కలెక్టర్‌ ప్రతిపాదించినా... దరఖాస్తులో పేర్కొన్న సేవా కార్యక్రమాలను పరిశీలించిన ప్రభుత్వం ఎకరా రూ.25లక్షల నామమాత్రపు ధరకే కేటాయించింది. ప్రభుత్వ షరతుల ప్రకారం కేటాయించిన భూమి మొత్తాన్నీ దరఖాస్తు సమయంలో పేర్కొన్న మాదిరిగా మూడేళ్లలో వినియోగంలోకి తేవాలి. లేదంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. కానీ సెయింట్‌ లూక్స్‌కు భూమి కేటాయించి 11 ఏళ్లు అవుతున్నా, కొంతభాగం మినహా మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. కొద్దిభాగంలో రెండు, మూడేళ్ల క్రితమే షెడ్లు నిర్మించి నర్సింగ్‌ కాలేజీ, విద్యార్థులకు వసతి ఏర్పాటుచేశారు. ఆస్పత్రి భవనం, ఉచిత వైద్య సేవల ఊసే లేదు! పైగా దరఖాస్తులో పేర్కొనని విధంగా ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అంతేకాకుండా దరఖాస్తు సమయంలో ప్రభుత్వానికి చెప్పినట్లు కాకుండా ఇక్కడి నర్సింగ్‌ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడం కూడా విమర్శలకు తావిస్తోంది. నర్సింగ్‌ కోర్సుకు ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నట్టు విద్యార్థినుల తల్లిదండ్రులు చెబుతున్నారు.  


ఆస్పత్రిపై కరస్పాండెంట్‌ దాటవేత

ఆస్పత్రి ఏర్పాటు గురించి సొసైటీ కరస్పాండెంట్‌ ప్రీతం లూక్స్‌ వద్ద ప్రస్తావించగా... పరిసర గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రి నిర్మాణం గురించి దాటవేశారు. 


పరిశీలిస్తాం : ఆర్డీవో

సెయింట్‌ లూక్స్‌కు కేటాయించిన స్థలం సరిగా వినియోగించారో లేదో స్వయంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో కె.పెంచలకిషోర్‌ చెప్పారు. 


అధికార పార్టీ నేత సన్నిహితులు!

ఈ సొసైటీ... భూమి కేటాయించిన సమయంలో ప్రభుత్వంలో గల ఒక నేతతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక నేత సన్నిహితులదని ప్రచారం. అందువల్లనే ఖరీదైన  భూమిని అతితక్కువ ధరకు కేటాయించారనే విమర్శలు వినిపించాయి. విశాఖపట్నంలో వేర్వేరు సంస్థల అవసరాలకు ఇచ్చిన భూములను నిబంధనల పేరుచెప్పి ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని వెనక్కి తీసేసుకుంటోంది. అయితే 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పేర్కొన్న నిర్మాణాలు, అందిస్తామన్న సేవలు అందించకుండా భూములను ఖాళీగా వదిలివేసిన సెయింట్‌ లూక్స్‌ సంస్థకు మాత్రం మినహాయింపు ఇవ్వడం వెనుక అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


Updated Date - 2020-03-02T07:29:04+05:30 IST