ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సుకు గవర్నర్‌ ఆమోదం

ABN , First Publish Date - 2020-03-30T07:21:13+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సుపై ఆదివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సచివాలయంలో శుక్రవారం సీఎం జగన్‌ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం...

ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సుకు గవర్నర్‌ ఆమోదం

  • 3 నెలల పద్దుకు రూ.70,994 కోట్లు
  • రెవెన్యూ ఆదాయం రూ.52,521 కోట్లు
  • రాష్ట్ర ఆదాయం, అప్పు సమానంగా వెల్లడి

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సుపై ఆదివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సచివాలయంలో శుక్రవారం సీఎం జగన్‌ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం ఈ ఏడాది జూన్‌ 30 వరకు రూ.70,994 కోట్లతో కూడిన బడ్జెట్‌కు ఆర్డినెన్సు తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆర్డినెన్స్‌ రూపొందించగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిని అనుమతించాలంటూ రాజ్‌భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్సును గవర్నర్‌ విశభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. ఈ 3 నెలల్లో రూ.52,521 కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని, అప్పుల ద్వారా రూ.14,725 కోట్లు, లోన్ల ద్వారా రూ.263 కోట్లు, పబ్లిక్‌ డెట్‌ ద్వారా రూ.3,483 కోట్లు సమకూరుతాయని ఆర్డినెన్సులో పేర్కొన్నారు. 

ఆర్డినెన్స్‌లో ఒకలా.. జీవోలో మరోలా!

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌, జీవోల్లో వాడిన పదజాలం వ్యూహాత్మకంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌ నుంచి వచ్చిన ఆర్డినెన్స్‌లో 2020వ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ‘కొంతకాలానికి’ రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రూ.70,994 కోట్లు మించకుండా ఖర్చు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్డినెన్సులో ఎన్ని నెలలు అనే సమయం పేర్కొనలేదు. కానీ ఆర్థికశాఖ ఇచ్చిన జీవోలో 2020 ‘ఏప్రిల్‌ 1 నుంచి 2020 జూన్‌ 31’ వరకు రూ.70,994 కోట్లు మించకుండా ఖర్చు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. 3 నెలల ఖర్చును, ఆదాయాన్ని సమానంగా చూపించడం విశేషం.

Updated Date - 2020-03-30T07:21:13+05:30 IST