నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్‌మెంట్..

ABN , First Publish Date - 2020-07-19T16:35:18+05:30 IST

నిమ్మగడ్డ తనను కలుసుకోడానికి గవర్నర్ సోమవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్‌మెంట్..

‘‘రాష్ట్రప్రభుత్వం నన్ను వేధిస్తోంది. రక్షణ కల్పించండి’’ అని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒకాయన ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాను ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికై కొన్ని వారాల తర్వాత ఆయన మళ్లీ గవర్నర్‌ను కలిశారు. అప్పుడు గవర్నర్‌ తన జేబులో నుంచి ఒక కాగితం తీసి, ‘‘మీరిచ్చిన వినతిపత్రం నా వద్దే ఉంది.. దీనిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను’’ అని తాపీగా సెలవిచ్చారట. దీనితో వినతిపత్రం ఇచ్చిన ఆయన అవాక్కయ్యారు.


ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీచ్యుతుడైన రమేశ్‌కుమార్‌ వంతు వచ్చింది. తనను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించవలసిందిగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసుకోండి అని రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తనను కలుసుకోవడానికి సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు రమేశ్‌కుమార్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే అంతకుముందు జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని రమేశ్‌కుమార్‌ విషయంలో గవర్నర్‌ ఎలా వ్యవహరించబోతున్నారా? అన్న విషయమై అధికార వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను నియమించవలసి ఉంటుంది. అయితే గవర్నర్‌ ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 


వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది కనుక గవర్నర్‌ సానుకూలంగా వ్యవహరించవచ్చు. అది జరగని పక్షంలో హైకోర్టు జోక్యం చేసుకుని రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించవచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు కనుక గవర్నర్‌ తీసుకోబోయే చర్యపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించినప్పుడు గవర్నర్లు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా అంటే, ‘కాదు’ అనే సమాధానం వస్తుంది.

Updated Date - 2020-07-19T16:35:18+05:30 IST