అయినా.. ముందుకే!

ABN , First Publish Date - 2020-08-18T08:53:38+05:30 IST

కోర్టులు ఏం చెప్పినా సరే... ‘మేం అనుకున్నదే చేస్తాం’ అన్నట్లుగా సర్కారు ముందుకు సాగుతోంది.

అయినా.. ముందుకే!

  • విశాఖలో రాజధానికి సర్కారు శ్రీకారం?
  • స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ..
  • గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమం


అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కోర్టులు ఏం చెప్పినా సరే... ‘మేం అనుకున్నదే చేస్తాం’ అన్నట్లుగా సర్కారు ముందుకు సాగుతోంది. రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్నా, కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టేటస్‌ కో విధించినా సరే... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ‘కొత్త కార్యాలయాల’ నిర్మాణానికి లాంఛనంగా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. విశాఖలోని కాపులుప్పాడలో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఆవరణలో ‘స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌’ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆగస్టు 16న కొత్త రాజధానికి శంకుస్థాపన చేస్తాం. ప్రధానిని, ఇతర ప్రముఖులనూ ఆహ్వానిస్తాం’ అని ప్రభుత్వం ఇది వరకే లీకులు ఇచ్చింది. అయితే, కోర్టులో కేసులు ఉండటం, కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో విధించడంతో ప్రభుత్వం ఆ పని చేయకపోవచ్చునని అంతా భావించారు. కానీ... తాను అనుకున్నట్లుగానే ఆగస్టు 16న (ఆదివారం) గుట్టుచప్పుడు కాకుండా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు భూమి పూజ చేసినట్లు తెలిసింది. ఇది కాకపోతే దసరా పోయేదాకా మంచి ముహూర్తంలేదనే ఇప్పుడే కొత్త రాజధానికి ‘లాంఛనంగా’ శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-18T08:53:38+05:30 IST