సర్కారు వారి.. ఇన్‌సైడర్‌ డ్రామా

ABN , First Publish Date - 2020-09-21T07:40:55+05:30 IST

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం 2014 సెప్టెంబరులో అసెంబ్లీలో ప్రకటన చేసింది. అయితే ఆ ఏడాది డిసెంబరులో రాజధాని ప్రాంత

సర్కారు వారి.. ఇన్‌సైడర్‌ డ్రామా

మంత్రివర్గ ఉపసంఘం శోధించి తేల్చిందేమిటి?

కొండను తవ్వి.. 

ఎలుక తోక నైనా పట్టలేదు

ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నివేదిక

దాని నిండా పొంతన లేని అంశాలు!

సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు జరిగిన

లావాదేవీలన్నీ ‘ఇన్‌సైడర్‌’ ఖాతాలోనే

సుదూరంగా భూములు కొన్నా అక్రమమేనట

2014 మే 26న రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య ఉండొచ్చని

చంద్రబాబు ప్రకటించింది జూన్‌ 9వ తేదీన

ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ నేతలెవరూ

కొన్నట్లు తేల్చలేకపోయిన కేబినెట్‌ సబ్‌ కమిటీ

ఏమీ దొరక్కే చంద్రబాబుపై బురదజల్లుడు

విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లను ఏమంటారు?

ప్రభుత్వంపై రాజధాని రైతుల ఆగ్రహం


రాజధాని భూములపై జగన్‌ ప్రభుత్వం శూలశోధన చేస్తున్నా.. కనిపెట్టింది, రాబట్టింది ఏమీలేదని స్పష్టమవుతోంది. గత ఏడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయితే.. అది శోధించి ఈ ఏడాది జనవరిలో ఓ నివేదిక ఇచ్చింది. దానిని పరిశీలిస్తే.. అన్నీ కప్పదాట్లే! ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా అక్కడ ఏదో జరిగిందని చెప్పడం కోసం పొంతనలేని అంశాలను అందులో ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది. రాజధానికి సుదూరంగా జరిగిన క్రయవిక్రయాలను కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఖాతాలో వేసి.. ప్రజల మనసులో చంద్రబాబుపై విషబీజాలు నాటడమే దీని అంతరార్థమని తేలిపోతోంది.(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం 2014 సెప్టెంబరులో అసెంబ్లీలో ప్రకటన చేసింది. అయితే ఆ ఏడాది డిసెంబరులో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం వచ్చినప్పటి నుంచి మాత్రమే రాజధానిగా పరిగణిస్తామని.. అంతకుముందు అక్కడ జరిగిన భూముల లావాదేవీలన్నీ ఇన్‌సైడర్‌ ట్రేడింగేనని జగన్‌ సర్కారు పదే పదే అనడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. చట్టం రాకముందే అనేక మంది భూములు కొనుక్కున్నారన్న విషయాన్ని బూచిగా చూపి గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని.. రాజధానిని తరలించడానికి దీనిని సాకుగా ఉపయోగించుకున్నారని స్పష్టమవుతోంది.


అంతేనా.. రాజధాని ప్రకటన రాకముందు జరిగిన లావాదేవీలను, రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు సుదూరంగా కొనుగోలు చేసిన భూములను కూడా ‘అమరావతి’ ఖాతాలోవేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కీలకమైన సచివాలయం, అసెంబ్లీ, కోర్టు భవనాలు, ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పే కోర్‌ కేపిటల్‌ ఏరియాలో జరిగిన లావాదేవీలపై దాటవేశారు.  ఉపసంఘం కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే రాజధాని ప్రాంతంలో భూములు కొనాలన్న ఆసక్తి, ఉత్సాహం వ్యాపారులు, నేతలు, చివరకు సామాన్యుల్లో సైతం ఉంటాయి.


ఇదే కోవలో అనేక మంది విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు. కృష్ణానదికి నలుదిక్కులా క్రయవిక్రయాలు జరిగాయి. ఇక్కడ భూములు కొనవద్దని ప్రభుత్వం ఏమీ ఆంక్షలు పెట్టలేదు. ఎందుకంటే రాజధాని ఏ గ్రామాల పరిధిలో ఉంటుందో అప్పటికింకా స్పష్టత ఇవ్వలేదు. ఆయా గ్రామాల ఈ పరిధిలో  లక్ష ఎకరాల భూములుంటే.. ఆ కాల వ్యవధిలో అంతా కలిపి రెండు వేల ఎకరాల విక్రయాలే జరిగాయి. పెద్దలంతా కలిసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే ఎన్నో వేల ఎకరాలు ఉండాలి కదా అన్న వాదన ప్రజల నుంచే బలంగా వినిపిస్తోంది.


 ఎవరు కొన్నారో కనిపెట్టారా? 

2014 అక్టోబరు, నవంబరుల్లోనే రాజధాని పరిధిలోని 29 గ్రామాల పేర్లను సర్కారు వెల్లడించింది. ఆ తర్వాతయినా, అంతకు ముందయినా చంద్రబాబు, ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలు ఆ గ్రామాల పరిధిలో భూములు కొని ఉన్నారా? బినామీ లావాదేవీలున్నాయా అన్నది ఉపసంఘం తేల్చలేకపోయింది. కోర్‌ కేపిటల్‌ పరిధిలో గానీ, భూ సమీకరణ జరిగిన గ్రామాల పరిధిలో గానీ భూములు కొనలేదు. మరి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడింది ఎక్కడ?


2014 జూన్‌ నుంచి సీఆర్‌డీఏ చట్టం తీసుకొచ్చిన డిసెంబరు వరకు ఏడు నెలల కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. ఇదంతా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగమేనని ఉపసంఘం చెప్పింది. కోర్‌ కేపిటల్‌ పరిధిలో, ప్రత్యేకించి భూ సమీకరణ జరిగిన గ్రామాల పరిధిలోనే నేతలు భూములు కొన్నారో లేదో నిగ్గు తేల్చనేలేదు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీ 2014 ఆగస్టులో తాడికొండ మండలంలో 14.22 ఎకరాలు కొనుగోలు చేసిందని పేర్కొంది. ఆ భూములు కోర్‌ కేపిటల్‌ ఏరియాకు అది 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.


సీఎంగా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కే పాల్పడి ఉంటే తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలోనో, ప్రతిపాదిత శాశ్వత సెక్రటేరియట్‌ సమీపంలోనో భూములు కొనేవారు. కానీ కోర్‌ కేపిటల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో భూమి కొనడం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగమని చెప్పడం ద్వారా ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు సైతం మండిపడుతున్నారు.


 సీఆర్‌డీఏ వచ్చాకే కొన్నారు..

మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ భూములు కొనుగోలు చేసింది కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రాంతంలో. ఇది కోర్‌ కేపిటల్‌ పరిధిలో లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ జాబితాలో లేదు.


కృష్ణానదికి అటువైపున.. రాజధాని ప్రాంతానికి 60-70 కి.మీ. దూరాన ఉంది. పోనీ.. ఆయన భూకొనుగోళ్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అందామా అంటే.. ఆయన కొన్నది 2015లో. అంటే అప్పటికే సీఆర్‌డీఏ అమల్లోకి వచ్చేసింది. రాజధాని ప్రాంతం నిర్ధారణ కూడా పూర్తయింది. ఆయనకు ఆ భూములు అమ్మినవారు కూడా.. వాటిని కొన్నది చంద్రబాబు అసెంబ్లీలో రాజధాని ప్రాంత ప్రకటన చేసిన తర్వాతే. అంటే ఏ విధంగా చూసినా ముందుగానే సమాచారాన్ని పొంది దమ్మాలపాటి భూములు కొనలేదన్నది స్పష్టమవుతోంది.


వైసీపీ నేతలు కొన్న భూములు ఏ ట్రేడింగ్‌లో..

అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న విజయవాడ, దాని చుట్టుపక్కల వైసీపీ నేతలు, హైదరాబాద్‌ ప్రముఖులు కొన్న భూములు ఏ ట్రేడింగ్‌ కిందకు వస్తాయో  ఉపసంఘం చెప్పలేదు. కానీ గుంటూరు జిల్లా పెదకూరపాడు, మంగళగిరి, గుంటూరు, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌, నూజివీడు, జగ్గయ్యపేట, కంచికచర్ల ఇంకా సుదూర ప్రాంతాల్లోని భూములన్నిటినీ రాజధాని భూములుగా చూపించి వాటిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అభియోగం మోపింది.


కోర్‌ కేపిటల్‌, ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిన గ్రామాల్లో జరిగిన లావాదేవీల్లో టీడీపీ నేతలు, వారి సన్నిహితులెవరైనా ఉన్నారో లేదో కూడా కనిపెట్టలేకపోయింది. అసలు పని వదిలేసి.. ఇతర లావాదేవీలకు అక్రమం అనే మసిపూసి దానిని మారేడుకాయగా చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అసలేం జరిగింది...? 


రాష్ట్ర విభజన ప్రకటన వెలువడానికి ముందే.. 2014 ఎన్నికల సమయంలోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల కొనుగోళ్లు జోరుగా సాగాయి. నవ్యాంధ్రకు విజయవాడ లేదా గుంటూరు మధ్యలో రాజధాని ఉండొచ్చని కొందరు.. నూజివీడులో పెట్టవచ్చని మరికొందరు భూములు కొన్నారు. 2014 జూన్‌ 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. మరుసటి రోజే రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉండొచ్చని ప్రక టించారు. ప్రత్యేకించి ఫలానా మండలం, గ్రామంలో ఉంటుందని చెప్పలేదు.


సెప్టెంబరు 4న రాజధానిపై అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రకటన చేశారు. అక్టోబరులో రాజధాని పరిధిలో ఏయే  గ్రామాలు ఉంటాయో వెల్లడించారు. నవంబరు 8న రాజధాని గ్రామాల విధాన ప్రకటన చేశారు. డిసెంబరులో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం తీసుకొచ్చారు. ఈ మధ్యలో అనేక మంది తమ భవిష్యత్‌ అవసరాల కోసమో, కొత్త రాజధానిలో సొంత ఇళ్లో, స్థలాలో ఉండాలని భావించి ఆ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు. ఇది తప్పని ఎలా చెబుతారు? బహిరంగంగా అందరికీ తెలిసే జరిగిన పరిణామాలకు రహస్యాన్ని, కుట్రలను ఆపాదించడం సరైనదేనా అన్నది ప్రశ్న.


ఇదేం తీరు? 


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ రాజధాని. దాని విస్తీర్ణం కనీసం 100 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుంది. హైదరాబాద్‌ మెట్రో డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లకు 20 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, అక్కడి భూములను కూడా రాజధాని భూములుగానే పరిగణిస్తున్నారా? లేదు కదా!


అమరావతి ప్రాంతంలో మాత్రం 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి డిసెంబరులో సీఆర్‌డీఏ చట్టం వచ్చే వరకు రాజధాని ప్రాంత పరిధిలో జరిగిన లావాదేవీలన్నీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్నట్లుగా మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పొందుపరిచింది. ఈ సూత్రం ప్రకారం.. జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందేవరకు విశాఖపట్నం పరిసరాల్లో జరిగిన అన్ని రకాల భూ క్రయవిక్రయాలన్నిటినీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌గానే పరిగణించాల్సి ఉంటుంది కదా అని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు.ఏది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌..?రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగానే తెలుసుకుని.. విధాన ప్రకటనలు రాకముందే గుట్టుచప్పుడు కాకుండా భూములు కొనుగోలు చేయడాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని సర్కారు చెబుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ వాదనకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. దీనిని నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రచారంలోని లోగుట్టు తెలుస్తుంది.


ఆంధ్రప్రదే శ్‌ రాష్ట్ర విభజనకు 2013 అక్టోబరు 3న కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2014 జూన్‌ 2న అపాయింటెడ్‌ డేను ప్రకటించారు. దీని మధ్యలో అంటే ఏప్రిల్‌ 30 నుంచి మే 28 వరకు ఉమ్మడిగానే ఆంధ్ర, తెలంగాణకు ఎన్నికలు నిర్వహించారు. మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 28వ తేదీన మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. తర్వాత  జూన్‌ 2న అపాయింటెడ్‌ డేను ప్రకటించారు. దీనికి ఆరు రోజుల తర్వాత అంటే జూన్‌ 8న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్య ఉన్న వ్యవధి 24 రోజులు. విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఉండొచ్చని ఆయన ప్రకటన చేసింది జూన్‌ 9న.


ఈ కాలవ్యవధిలో చంద్రబాబు, ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలు, వ్యాపారులు సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఏమైనా భూములు కొన్నారా.. అంటే లేదు. జగన్‌ ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టాలో చంద్రబాబు ముందుగానే నిర్ణయించుకుని.. జూన్‌ 8కి ముందు హడావుడిగా భూములు కొనుగోలు చేసి ఉంటే అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనడానికి.. అక్రమం అనడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటిదేమీ జరక్కున్నా.. ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఉపసంఘం చెబుతున్న భూముల లెక్క ఇదీ.. 
నెల గుంటూరు  కృష్ణా మొత్తం 

(ఎకరాల్లో) (ఎకరాల్లో) భూములు 

జూన్‌ 2014 261.72 268.97 530.69

జూలై 2014 309.44 375.9 685.34

ఆగస్టు 2014 161.49 191.54 353.03

సెప్టెంబరు 2014 302.97 264.29 567.26

అక్టోబరు 2014 338.96 225.95 564.91

నవంబరు 2014 595.2 241.61 836.81

డిసెంబరు 2014 310.13 221.77 531.9

మొత్తం 2279.91 1790.04 4069.94


Updated Date - 2020-09-21T07:40:55+05:30 IST