ఏపీ ప్రభుత్వ అనైతిక నిర్ణయాలను తిరస్కరించండి

ABN , First Publish Date - 2020-07-14T08:30:33+05:30 IST

శాసన, రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులు ఆమోదించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ప్రభుత్వ అనైతిక నిర్ణయాలను తిరస్కరించండి

  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి అమరావతి జేఏసీ నేత శివారెడ్డి లేఖలు 


విజయవాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శాసన, రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులు ఆమోదించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మంత్రిమండలి ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి అప్రజాస్వామిక, అనైతిక నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరించాలని అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులకు విజ్ఞప్తి చేసింది. ఆ రెండు బిల్లులపై చర్చ సందర్భంగా శాసనసభ, శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎ.శివారెడ్డి రాసిన లేఖ ప్రతులను సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షాలకు ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు. ఏపీ ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన ఆ రెండు బిల్లుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని శివారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.


ఆ బిల్లులను ఆమోదిస్తే రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలిచ్చిన 29 గ్రామాల రైతులకు తీరని నష్టం వాటిల్లడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు, జాతీయ స్థూల ఉత్పత్తికి కూడా నష్టం వాటిల్లుతుందని శాసనమండలి భావించి.. వాటిని సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని నిర్ణయించిందని వివరించారు. శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని నిర్ణయించిన ఆ రెండు బిల్లులను యథాతథంగా రెండోసారి శాసనసభలో ఆమోదించి.. మళ్లీ మండలి ఆమోదం కోసం పంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వివరించారు. 

Updated Date - 2020-07-14T08:30:33+05:30 IST