మొన్న భర్త.. నిన్న కొడుకు..!

ABN , First Publish Date - 2020-08-18T09:41:36+05:30 IST

మూడు రోజుల క్రితం భర్త.. రెండు రోజులైనా గడవకముందే కొడుకు కరోనాకు బలవగా..

మొన్న భర్త.. నిన్న కొడుకు..!

  • కరోనాతో ఆస్పత్రిలో తల్లి
  • ప్రభుత్వ డాక్టర్‌ ఇంట విషాదం

శ్రీకాళహస్తి, ఆగస్టు 17: మూడు రోజుల క్రితం భర్త.. రెండు రోజులైనా గడవకముందే కొడుకు కరోనాకు బలవగా.. ఆ తల్లి ఆస్పత్రిలో కొవిడ్‌కు చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడుతోంది. ఐదు నెలలుగా కొవిడ్‌ విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్‌ కుటుంబంలో వైరస్‌ సృష్టించిన విషాదమిది. శ్రీకాళహస్తి ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్‌ (44) మార్చి 28 నుంచి కొవిడ్‌ విధుల్లో ఉన్నారు. ఈ నెల 3న డాక్టర్‌తో పాటు అదే ఆస్పత్రిలో పనిచేసే మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన రుయాస్పత్రిలో చేరారు.


ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ సూచనల మేరకు ఆయన తల్లిదండ్రులు కూడా పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిద్దరూ డ్రైవర్‌ సాయంతో కారులో ఆస్పత్రికి బయల్దేరారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన డాక్టర్‌ తండ్రి కారులోనే  ప్రాణాలు విడిచారు. తండ్రి మరణవార్త కొడుక్కి చెప్పలేదు. ఈలోగా డాక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మరణించారు. అటు భర్త, ఇటు కొడు కు.. కరోనాకు బలవగా ప్రస్తుతం డాక్టర్‌ తల్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

Updated Date - 2020-08-18T09:41:36+05:30 IST