ఐపీఎస్‌లకు గుడ్‌బై!
ABN , First Publish Date - 2020-12-13T09:06:45+05:30 IST
ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఐపీఎస్‌లకు గుడ్‌బై చెప్పేసింది. అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసే విజిలెన్స్ విభాగం నుంచి పోలీసు

డీఎస్పీలను సైతం వెనక్కి పంపిన ఆర్టీసీ
నిన్న ఎండీ, నేడు విజిలెన్స్ డీఐజీ అవుట్
ఒక్క ఏఎస్పీ చాలంటూ ఎండీ ఉత్తర్వులు
చర్చనీయాంశంగా కృష్ణబాబు నిర్ణయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఐపీఎస్‌లకు గుడ్‌బై చెప్పేసింది. అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసే విజిలెన్స్ విభాగం నుంచి పోలీసు అధికారులను సాగనంపింది. డీఐజీ నుంచి డీఎస్పీ వరకూ ఎవరూ అక్కర్లేదని భావిస్తోంది. తమకు ఒకే ఒక్క ఏఎస్పీ చాలంటూ ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు జారీ చేసిన ఆదేశాలు సంస్థలో చర్చనీయాంశమయ్యాయి. ఏటా రూ.వందల కోట్ల లావాదేవీలు జరిగే ఈ సంస్థ గ్యారేజీ నుంచి ఒక్క బోల్టు బయటికి వెళ్లినా, అధికారులు అక్రమాలకు పాల్పడినా ఇట్టే పట్టేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆస్తుల పరిరక్షణ నుంచి పరికరాల కొనుగోళ్ల వరకూ అన్నింటిపై నిఘా ఉంటుంది. ఆర్టీసీలో సమ్మెలు, ఇతర వ్యవహారాలు ఉంటాయనే ప్రభుత్వాలు కొన్నేళ్లుగా సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎండీగా నియమిస్తున్నాయి.
ఆర్టీసీని సక్రమంగా నిర్వహించగలిగిన ఎండీ రాష్ట్ర డీజీపీగా అర్హుడని నియామకాలు కూడా చేస్తాయి. ఆ తర్వాత కీలక పోస్టు అయిన విజిలెన్స్ విభాగాధిపతిగా ఐజీ/ డీఐజీ ర్యాంకు అధికారి విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయన కింద నాన్ కేడర్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు ఉంటారు. హెచ్‌వోడీల నుంచి డిపో మేనేజరు వరకూ ఎవరిపైన ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించి నివేదిక అందజేస్తారు. అందులో తీవ్రత ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఆర్టీసీలో ఆనవాయితీ. అయితే ఏడాదిన్నరగా ఈ పోస్టులో ఐపీస్ అధికారి లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావును ప్రభుత్వం డీజీపీగా నియమించింది. విజిలెన్స్ విభాగ అధిపతిగా ఉన్న కేవీవీ గోపాలరావు గుంటూరు రేంజ్ ఐజీగా బదిలీ అయ్యారు. తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఐపీఎస్‌ల కొరత కారణంగా నియామకం సాధ్యం కాలేదు.
ఎండీ పోస్టు నుంచి మాదిరెడ్డి ప్రతా్‌పను తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి కృష్ణబాబుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆర్టీసీకి ఐపీఎస్ అధికారులు పూర్తిగా దూరమయ్యారు. రేపోమాపో విజిలెన్స్ విభాగానికి డీఐజీ లేదా సీనియర్ ఐపీఎస్ అధికారి వస్తారనుకొంటున్న తరుణంలో తమకు అక్కర్లేదంటూ ఎండీ అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. ఒక ఏఎస్పీ మినహా డీఎస్పీలను సైతం పోలీసుశాఖకు పంపేశారు. విజిలెన్స్‌లో ఆర్టీసీ అధికారులే ఉంటే కీలక విషయాల్లో రాజీపడే అవకాశాలు ఉంటాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇతర శాఖలకూ దూరం
ఆర్టీసీ ఎండీ, విజిలెన్స్ చీఫ్ పోస్టుల నుంచి దూరమైన ఐపీఎస్ అధికారులు ఇతర శాఖలను సైతం చేజార్చుకొంటున్నారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు 461మందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఐజీ కాంతారావు నేతృత్వంలో తిరుపతి కేంద్రంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టింది. వైపీసీ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను బదిలీ చేసింది. ఆ స్థానంలో మరొక ఐపీఎ్‌సను నియమించలేదు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఎర్ర స్మగ్లర్ల వాహనాలు ప్రమాదానికి గురవడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖలో అంతర్భాగమైన డ్రగ్ కంట్రోల్ విభాగం డీజీ పోస్టులో అడిషనల్ డీజీ ర్యాంకు అధికారులు బాధ్యతలు నిర్వర్తించడం దశాబ్దాలుగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నకిలీ మందుల తయారీ ముఠాలను దేశంలోని పలు ప్రాంతాల్లో గుర్తించి ఢిల్లీకి సమీపంలోని రూర్కీ నుంచి రూ.కోట్లు విలువైన యంత్రాలను విజయవాడకు తెచ్చి సీజ్ చేశారు.
బాధ్యులను సైతం జైలుకు పంపడం అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా రాజమండ్రి, కడప, నంద్యాల తదితర ప్రాంతాల్లో నకిలీ మందుల విక్రయదారులపై ఉక్కుపాదం మోపారు. అటువంటి పోస్టులో జగన్ ప్రభుత్వం ఐపీఎ్‌సను తప్పించి ఐఆర్‌ఎస్ అధికారిని నియమించింది. ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన ఆయనకు ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో మందుల విక్రయాల్లో అక్రమాల సంగతి అటుంచి శానిటైజర్లు తాగి మందుబాబులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.