ఉగ్ర గోదావరి

ABN , First Publish Date - 2020-08-16T11:06:39+05:30 IST

పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ..

ఉగ్ర గోదావరి

  • ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
  • గంటకు 2 పాయింట్లు పెరుగుతున్న నీటిమట్టం
  • స్పిల్‌వేలోకి నీరు.. ‘పోలవరం’ పనులు నిలిపివేత
  • దేవీపట్నం మండలంలో నీట మునిగిన గ్రామాలు
  • కృష్ణానదిలోనూ వరద ఉధృతి
  • ‘శ్రీశైలం’లో 136.60 టీఎంసీల నీరు
  • ప్రకాశం బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు రెండు పాయింట్ల చొప్పున నీటిమట్టం పెరుగుతూ సాయంత్రానికి 12.70 అడుగులకు చేరింది. నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11,86,403 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే అర్ధరాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గ్యాజ్‌ మట్టం 13.10 అడుగులు ఉండగా, పాండ్‌ లెవల్‌ 14.66 మీటర్లు ఉంది. భద్రాచలం వద్ద 46 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువన లక్ష్మీ బ్యారేజీ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని వదిలేయడం వల్ల రాబోయే 2 రోజుల్లో గోదావరి మరింత ఉధృతమవుతుందని అధికారులు చెప్తున్నారు.   రాజమహేంద్రవరం లంకల్లోని గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు డొంకరాయి నుంచి 33,365 క్యూసెక్కుల నీరు వస్తోంది. సీలేరు, శబరి పొంగడంతో విలీన గ్రామాల రహదారులన్నీ మునిగిపోయాయి. దేవీపట్నం మండలంలో పది గ్రామాలు మునిగిపోయాయి. ఎక్కువ మంది గోదావరిలో ఉండిపోయారు. కొండలపైన, డాబాల మీద నివసిస్తున్నారు. 6,550 మందికి సరిపడా పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ శనివారం 77మంది మాత్రమే ఆ కేంద్రాలకు వచ్చారు. 1,541 మందిని గ్రామాలనుంచి తరలించారు. ముంపు ప్రాంతానికి చెందిన నలుగురు గర్భిణులు, ఇద్దరు బాలింతలను రంపచోడవరంలోని ఏపీఆర్జేసీకి తరలించినట్టు అధికారులు చెప్పారు.
ప్రకాశం బ్యారేజీకి 82,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం82,000 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. మొత్తం 70 గేట్ల ద్వారా 43,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మొత్తం 70 గేట్లను అడుగు మేర ఎత్తిన అధికారులు, శనివారం ఉదయం పది గేట్లను కిందికి దించేశారు. వరద పెరుగుతుండడంతో సాయంత్రం  మళ్లీ ఆ పది గేట్లను కూడా పైకి ఎత్తారు.


శ్రీశైలానికి 1.25 లక్షల ఇన్‌ఫ్లో 

శ్రీశైలం జలాశయానికి 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 868.40 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుకాగా, 136.60 టీఎంసీల నీరు నిల్వఉంది. జూరాల స్పిల్‌ వే నుంచి 91,546 క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ నుంచి 31,958 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. తెలుగు గంగ, ఎస్సార్బీసీ ద్వారా 12 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి తెలుగు గంగ కింద ఆయకట్టుకు కూడా 3 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2020-08-16T11:06:39+05:30 IST