కరోనా దేవుడెరుగు... ప్రాణాలే ముఖ్యం!

ABN , First Publish Date - 2020-05-09T10:07:12+05:30 IST

లాక్‌డౌన్‌తో నెలన్నరగా ఇళ్లకే పరిమితమైనవారు... స్టైరిన్‌ ముప్పుతో ఒక్కసారిగా గుంపులుగా రోడ్లెక్కాల్సి వచ్చింది. కరోనా సంగతి దేవుడెరుగు... తక్షణం ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యంగా మారింది.

కరోనా దేవుడెరుగు... ప్రాణాలే ముఖ్యం!

ఆందోళనతో వేలమంది పరుగులు


విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో నెలన్నరగా ఇళ్లకే పరిమితమైనవారు... స్టైరిన్‌ ముప్పుతో ఒక్కసారిగా గుంపులుగా రోడ్లెక్కాల్సి వచ్చింది. కరోనా సంగతి దేవుడెరుగు... తక్షణం ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యంగా మారింది. ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి వెళ్లాల్సి వచ్చింది. పునరావాస శిబిరాల్లో కలిసే ఉండాల్సిన పరిస్థితి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, వారి అనుచరగణం, అధికారులు, పోలీసు సిబ్బంది... ఇలా వందలాది మంది గుమిగూడారు.


తాజా పరిణామాలతో వైరస్‌ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి విషవాయువు లీకైందన్న వార్తలతో ప్రజలు మరింత ఆందోళన చెందారు. రాత్రి 10గంటల నుంచి వేల మంది గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. అందుబాటులో ఉన్న వాహనాలెక్కి సురక్షితమనుకున్న ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాహనాలు లేనివారు గుంపులుగా నడుచుకుంటూ బయల్దేరారు. 


కోలుకున్న యువకుడికి మళ్లీ వైరస్‌? 

కరోనా నుంచి కోలుకున్న యువకుడికి మరోమారు వైరస్‌ సోకినట్టు తెలిసింది. మార్చిలో ముంబై నుంచి విశాఖకు వచ్చిన యువకుడి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం నెగెటివ్‌ రావడంతో అతడ్ని డిశ్చార్జి చేశారు. తాజాగా ఆ యువకుడికి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో పరీక్షలు చేయగా వైరస్‌ ఉన్నట్టు తేలింది. 

Updated Date - 2020-05-09T10:07:12+05:30 IST