దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-03-02T07:22:52+05:30 IST

మోదీ, జగన్‌, కేసీఆర్‌.. మీకు దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి... అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ సవాల్‌ విసిరారు. రిజర్వేషన్ల భిక్షం తమకు అవసరం లేదని, ఈ వంకతో దేశంలో అణగారిన...

దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి

  • రిజర్వేషన్ల భిక్షం మాకు అవసరం లేదు 
  • ఆ వంకతో అణగారిన వర్గాలతో ఆటలా? 
  • మాల మహానాడు నేత.. అద్దంకి దయాకర్‌ సవాల్‌
  • ‘పౌరసత్వా’లపై వైసీపీకి సిగ్గులేదు: హర్షకుమార్‌


కాకినాడ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మోదీ, జగన్‌, కేసీఆర్‌.. మీకు దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి... అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ సవాల్‌ విసిరారు. రిజర్వేషన్ల భిక్షం తమకు అవసరం లేదని, ఈ వంకతో దేశంలో అణగారిన వర్గాలతో ఆటలాడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆనందభారతి గ్రౌండ్‌ లో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొండబాబు అధ్యక్షతన ఆదివారం రాత్రి మాలల మహాయుద్ధభేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దయాకర్‌ మాట్లాడుతూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆనాడే గాంధీజీ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు.


దాన్ని ఖండిస్తూ మనువాదాన్ని కాదని, మనవాదమే కావాలని పోరాటం చేసిన అంబేడ్కర్‌కు మనువాదులు ఇచ్చిన బిరుదు ఏంటో ఈ పాలకులకు గుర్తుందా అని మండిపడ్డారు. ప్రధాని మోదీ దళితులను విభజించే సాహసం చేయలేరని, చేస్తే భారత రాజ్యాంగం ఒప్పుకోదని దయాకర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రైస్తవులు, ముస్లింలు రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్తున్నారని గమనించి అటుగా వెళ్లే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే దిశగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలను తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ఇప్పుడు ప్రధాని తెస్తున్న పౌరసత్వ సవరణ చట్టాల వల్ల దేశానికి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అగ్రకుల హిందువులకు తప్ప మిగిలిన సమాజానికి ఉపయోగం లేదన్నారు. కొత్త చట్టాలను అమలు చేయబోమని కేరళ, పశ్చిమబెంగాల్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయని, ఆ మాత్రం దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌కు చెందిన సియాసత్‌ ఉర్దూ దినపత్రిక ఎడిటర్‌ జహార్‌ అలీఖాన్‌, జమైతే ఉలేమా ఫ్రీడం పైటర్‌ ్స అధ్యక్షుడు షబ్బీర్‌ మాట్లాడుతూ దేశంలో తమ గుర్తింపును కేంద్రం ప్రశ్నిస్తోందని, తమకు బాబా సాహెబ్‌ ఒక్కరే గుర్తింపు అని చెప్పారు.

Updated Date - 2020-03-02T07:22:52+05:30 IST