జెన్‌కో నెత్తిన ఎధెనా పిడుగు

ABN , First Publish Date - 2020-03-02T08:09:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో నెత్తిన ఛత్తీ్‌సగఢ్‌ పిడుగు పడబోతోంది. పదేళ్ల కిందట ఆ రాష్ట్రంలో నిర్మాణం మొదలై పూర్తికాలేక ఆపసోపాలు పడుతున్న ఒక ప్రైవేటు థర్మల్‌ ప్లాంట్‌ను ‘జెన్‌కో’తో...

జెన్‌కో నెత్తిన ఎధెనా పిడుగు

  • ఛత్తీ్‌సగఢ్‌లో ప్లాంటు కొనాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి


  • అసలే సంస్థలో ఆర్థిక కల్లోలం
  • ఉన్నవే అమ్ముకొనే పరిస్థితులు
  • రూ.600 కోట్లు లేక ఎన్టీపీసీకి
  • కడప ప్లాంటు విక్రయ యత్నం
  • అలాంటిది వేల కోట్లతో కొత్తదా?
  • అది కూడా నక్సల్స్‌ ప్రాంతంలో? 
  • ప్రశ్నిస్తున్న ఇంజనీర్ల సంఘాలు
  • అయినా చకచకా ఫైళ్ల కదలిక
  • కావాల్సినవారి కోసమే ఇదంతా
  • ప్రభుత్వ వైఖరిపై విమర్శలు

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో నెత్తిన ఛత్తీ్‌సగఢ్‌ పిడుగు పడబోతోంది. పదేళ్ల కిందట ఆ రాష్ట్రంలో నిర్మాణం మొదలై పూర్తికాలేక ఆపసోపాలు పడుతున్న ఒక ప్రైవేటు థర్మల్‌ ప్లాంట్‌ను ‘జెన్‌కో’తో కొనిపించాలని ప్రభుత్వ పెద్దలు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలే జెన్‌కో ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉంది. తన ఆర్థిక భారం తగ్గించుకోవడానికి సొంతంగా నిర్మించి నిర్వహిస్తున్న థర్మల్‌ ప్లాంట్లనే విక్రయించే ప్రయత్నాల్లో ఉంది.


ఇటువంటి సమయంలో నక్సల్స్‌ సమస్యతో కుతకుత ఉడుకుతున్న రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రైవేటు థర్మల్‌ ప్లాంట్‌ కొనాలనే ప్రతిపాదన తెరపైకి రావడం సంస్థలోని అధికారులు, ఇంజనీర్లను నిర్ఘాంతపరుస్తోంది. అయితే, ఛత్తీ్‌సగఢ్‌లోని ఎధెనా థర్మల్‌ ప్లాంట్‌ కొనుగోలుకు సంబంధిత శాఖల పరిధిలో శరవేగంగా ఫైళ్లు కదులుతున్నాయి. కొనుగోలుకు మార్గం సుగమం చేసేలా కొన్ని ఉత్తర్వులు ఇప్పటికే వెలువడ్డాయి. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం జంజ్‌గిర్‌- చంపా జిల్లాలోని సింఘిత్‌రాయ్‌ గ్రామంలో 1200 మెగావాట్ల సామర్థ్యంతో ఎధెనా ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. 2007లో దీని నిర్మాణం మొద లైంది. ఎ.సీతారామరాజు ఈ కంపెనీకి చైర్మన్‌. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ బేగంపేటలోని గ్రీన్‌లాండ్స్‌లో ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.


రూ.6,200కోట్ల అంచనాతో నిర్మాణం మొదలుపెట్టారు. ఇంతవరకూ పూర్తేకాలేదు. బ్రిక్‌ వర్క్స్‌ రేటింగ్స్‌ అనే సంస్థ అంచనా ప్రకారం ఇప్పుడు దీని నిర్మాణ వ్యయం రూ.8,464కోట్లకు పెరిగింది. ఈ ప్లాంట్‌ బ్యాంకులకు రూ.5,300కోట్లు బకాయిఉంది. రుణాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో బ్యాంకులు ప్లాంటును విక్రయించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆకస్మికంగా దీనిపై ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ప్లాంటు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు రాగానే, వాటిని పరిశీలించాలని ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఈ ప్రాజెక్టు కొనుగోలుచేసి దానినుంచి విద్యుత్‌ తీసుకోవడానికి అనుమతి కావాలని జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ ఒకరు జనవరి 18వ తేదీన ట్రాన్స్‌కో సీఎండీకి లేఖ రాశారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో నిర్ణయాధికారం ఉన్న ఏపీపీసీపీకి కూడా ఇదే సీఎండీ.. చైర్మన్‌గా వ్యవహరిస్తుంటారు. జెన్‌కో నుంచి లేఖవచ్చిన సరిగ్గా మూడు రోజుల్లో ట్రాన్స్‌కో సీఎండీ అనుమతి మంజూరు చేస్తూ సమాధానం పంపారు. అంతపెద్ద అంశంలో ఇంత వేగంగా అనుమతి రావడం విద్యుత్‌ సంస్థల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 


అధికారుల్లో నిరాసక్తి

అన్నిఖర్చులు కలుపుకొని రూ.3.80కి విద్యుత్‌ వస్తే ఎధెనా నుంచి కొనుగోలు చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఏపీపీసీపీ చైర్మన్‌ హోదాలో ట్రాన్స్‌కో సీఎండీ జెన్‌కోకు రాసిన లేఖలో తెలిపారు. ప్లాంటు కొనుగోలులో అనేక సమస్యలు ఉండటంతో ఈ అనుమతి వచ్చిన తర్వాత కూడా అధికారులు పెద్దగా కదలలేదు. ఒత్తిడి పెరగడంతో ఇటీవల కసరత్తు మొదలుపెట్టారు.


వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పెద్దలు గట్టిగా ఆదేశించినట్లు సమాచారం. పైనుంచి ఒత్తిడి పెరగడంతో ఒక కమిటీని ఏర్పాటుచేసి గతంలో వ్యక్తమైన అభ్యంతరాలు తోసిపుచ్చాలని అనుకొంటున్నారని సమాచారం. అవసరమైతే ఇదే కమిటీని ఛత్తీ్‌సగఢ్‌ పంపి క్షేత్ర పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకొన్నట్లుగా చూపాలనే ఆలోచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. 


నక్సల్స్‌ అడ్డాలో అవసరమా..

ఎధెనా కొనుగోలుకు జెన్‌కో రూ.5వేల కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తుందని సమాచారం. ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేయడానికి పెట్టాల్సిన పెట్టుబడి అదనం. ముందు దీనిని కొనుగోలు చేస్తే రుణాలిచ్చిన బ్యాంకులకు వారి పెట్టుబడి తిరిగి వస్తుంది. ఈ ప్లాంట్‌ను పెట్టినవారికి రుణభారం తీరిపోతుంది. జెన్‌కో ఇంత పెట్టుబడి ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదని, చాలావరకూ బ్యాంకులు రుణం ఇస్తాయని ఈ డీల్‌ను సమర్థిస్తున్నవారు చెబుతున్నారు.


కొనుగోలు చేసిన తర్వాత ప్లాంటును పూర్తిచేసే బాధ్యతను జెన్‌కో తీసుకోవాలి. దానికి అవసరమైన రూ.వేల కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు అధికారులు, సిబ్బందిని అక్కడకు తరలించి ఆ పని పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వహణను కూడా ఆ సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్‌ ఉన్న ప్రాంతంలో నక్సల్స్‌ సమస్య కూడా తీవ్రంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎక్కడో ఉన్న ప్రాంతానికి వెళ్లి జెన్‌కో ఇంత తలనొప్పిని తెచ్చుకోవడం ఎందుకన్న ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నములుతున్నారు. 


ఇంత కటకటలో..

కడప జిల్లాలోని ముద్దనూరులో రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌ను జెన్‌కో కొన్నేళ్ల కిందట నెలకొల్పింది. నిర్వహణలో నష్టాలు వస్తున్నాయన్న కారణంతో దానిని ఎన్టీపీసీకి విక్రయించాలని ప్రయత్నిస్తోంది. ‘‘కొత్త్త నిబంధనల ప్రకారం థర్మల్‌ కేంద్రాల్లో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అవి తీసుకోవడానికి మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. అంత పెట్టుబడి పెట్టగలిగే పరిస్ధితిలో లేము. పైగా ఆ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి ఖర్చు కూడా బాగా ఎక్కువ అవుతోంది. అందుకే విక్రయించాలన్న ఆలోచనకు వచ్చాం’’ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌లో కాలుష్య నివారణ చర్యలకు సుమారుగా రూ.600కోట్లు అవుతుంది. ఆ మాత్రం డబ్బే లేని జెన్‌కో వేరే రాష్ట్రానికి వెళ్లి వేల కోట్లతో ప్రైవేట్‌ ప్లాంట్‌ ఎలా కొనుగోలు చేస్తోందన్న ప్రశ్నకు మౌనమే సమాధానంగా వస్తోంది.


ఇటువంటి ప్లాంట్లు ఛత్తీ్‌సగఢ్‌లో 30- 40 వరకూ విక్రయానికి ఉన్నాయని, ఇంకా తక్కువ ధరకు లభ్యమయ్యేవి కూడా ఉన్నాయని ఒక అధికారి వెల్లడించారు.  కొద్ది నెలల్లో ‘జెన్‌కో’కు తన సొంత విద్యుత్‌ ప్లాంట్ల నుంచి 1600 మెగావాట్ల విద్యుత్‌ కొత్తగా అందుబాటులోకి రాబోతోంది. విజయవాడ సమీపంలోని వీటీపీఎ్‌సలో 800మెగావాట్లు, కృష్ణపట్నం థర్మల్‌లో మరో 800మెగావాట్లు త్వరలో ఉత్పత్తిలోకి రాబోతున్నాయి. ఇవికాక సౌర విద్యుత్‌లో మరో పది వేల మెగావాట్ల మేర ఉత్పత్తి ప్లాంట్లు రాష్ట్రంలో నెలకొల్పాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కూడా మొదలుపెట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అక్కడ నుంచి 960 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అలాగే సీలేరులో 400మెగావాట్ల జల విద్యుత్‌ను రివర్స్‌ ఇంజనీరింగ్‌ పద్ధతిలో ఉత్పత్తి చేయాలని ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. స్థానికంగానే ఇంత విద్యుత్‌ లభ్యత ఉన్నప్పుడు మరెక్కడికో వెళ్లి ప్రైవేటు ప్లాంట్‌ కొని దానిని నడపాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న! 


ఉద్యోగ సంఘాల అభ్యంతరం 

‘ఛత్తీ్‌సగఢ్‌లో ఈ ప్లాంట్‌ను పెట్టినవారికి దాన్ని పూర్తిచేసే శక్తిలేదు. ప్రభుత్వం ద్వారా కొనిపించి తాము బయటపడాలని చూస్తున్నారు’ అని ఒక రిటైర్డ్‌ అధికారి ఆరోపించారు. ఈ కొనుగోలు ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు కూడా యాజమాన్యానికి తమ అభ్యంతరం తెలిపాయి. పొరుగు రాష్ట్రాల్లో జెన్‌కో కొనుగోలు చేయాలని అనుకొంటున్న ప్లాంట్ల వల్ల సాంకేతికంగా, నిర్వహణపరంగా, వాణిజ్యపరంగా చాలా సమస్యలు వస్తాయని, ఇప్పటికే విద్యుత్‌లో మిగులులో ఉన్న రాష్ట్రం ఇటువంటి ఆలోచనలు చేయడం సరికాదని ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్ల సంఘం ఇటీవల ఒక లేఖలో యాజమాన్యాన్ని హెచ్చరించింది.


‘ఎధెనా ప్లాంట్‌కు సరైన బొగ్గు లింకేజీ లేదు. దీనిని కొనాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీకు ప్రతిపాదన వస్తే అది తిరస్కరించింది. చైనా యంత్రాలతో తయారు కావడంతో ఈ ప్లాంట్‌ తమకు వద్దని పేర్కొంది. దీన్ని కొనడానికి ముందు సాంకేతిక, ఆర్థిక, వాణిజ్యపరమైన అంశాలు ఎంతవరకూ అనుకూలిస్తాయో ఒక కమిటీతో విశ్లేషణ జరగాలి’ అని ఈ సంఘం యాజమాన్యానికి రాసిన లేఖలో సూచించింది.

Updated Date - 2020-03-02T08:09:24+05:30 IST