గ్యాస్ బాధితులకు రూ.30కోట్లు
ABN , First Publish Date - 2020-05-09T09:47:40+05:30 IST
విశాఖలో గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.30కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎంఆర్‌ఎఫ్ నుంచి విడుదల
అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): విశాఖలో గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.30కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట ఈ నిధులను శుక్రవారం విడుదల చేసినట్లు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘విశాఖ’ ఘటనలో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి గురువారం విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భంగా.. మృతుల కుటుంబాలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ఆదుకుంటామని అక్కడికక్కడే వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చారు. బాధితులను తక్షణమే గుర్తించి పరిహారం అందించాలని, అనంతరం వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాలని విశాఖ కలెక్టర్‌ను ఆ ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ ఆదేశించింది.