అర్ధరాత్రి కలకలం

ABN , First Publish Date - 2020-05-08T10:17:27+05:30 IST

బుధవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన విష వాయువు కలకలం గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది.

అర్ధరాత్రి కలకలం

ట్యాంకర్‌ పేలుతుందనే వదంతులు

ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు

అంతకుముందే 15వేల మంది పరుగు


విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి): బుధవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన విష వాయువు కలకలం గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది. రోజంతా పలు దఫాలుగా స్టైరిన్‌ ఆవిరి లీక్‌ అయినట్లు గుర్తించారు.  గురువారం అర్ధరాత్రి సమయంలో మరో కలకలం చెలరేగింది. పాలిమర్స్‌ కంపెనీ పరిసరాల్లో నాలుగైదు గ్రామాల ప్రజలను అధికారులు అంతకుముందే ఖాళీ చేయించారు. మరో 24 గంటలపాటు ప్రభావం ఉంటుందని గురువారం రాత్రి 11 గంటల సమయంలో నాయుడుతోట జంక్షన్‌లో పోలీసులు మైకుల ద్వారా హెచ్చరించారు.అర్ధరాత్రి సమయంలో... ఎల్జీ పాలిమర్స్‌లోని రసాయన ట్యాంకు  పేలుతుందనే వదంతులు గుప్పుమన్నాయి. దీనికితోడు గ్యాస్‌ వాసన ఘాటు తగ్గకపోవడంతో ప్రజలు బతుకుజీవుడా అంటూ ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరు కాలినడకన, మరికొందరు ఆటోలు, ద్విచక్రవాహనాలపై అడవివరం, సింహాచలం మీదుగా ఆరిలోవ వైపు వెళ్లిపోతున్నారు.


ఎల్జీ పాలిమర్స్‌కు సుమారు ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో వున్న ఎన్‌ఏడీ జంక్షన్‌, మర్రిపాలెం, కంచరపాలెం ప్రాంతాలవాసులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో గురువారం అర్ధరాత్రి గోపాలపట్నం బీఆర్‌టీఎస్‌ రోడ్డుతోపాటు ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి జనంతో రద్దీగా మారింది. కొంతమంది బంధువులు ఇళ్లకు, మరికొంతమంది ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకునేందుకు బయలుదేరారు.


15వేల మంది పరుగు...

విష వాయువు కమ్ముకోవడంతో గురువారం ఉదయమే వెంకటాపురం, నందమూరి నగర్‌, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీ, జనతాకాలనీ, కంపరపాలెం ప్రాంతాలకు చెందిన సుమారు 15వేల మంది ఇళ్లు విడిచిపెట్టిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాణాలు కాపాడుకునే తొందరలో చాలామంది చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయారు. ఒకరినొకరు చూసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. కార్లు, బైకులు, ఆటోలు... ఇలా ఏ వాహనం దొరికితే అది పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లను అధికారులే ఖాళీ చేయించారు. 

Updated Date - 2020-05-08T10:17:27+05:30 IST