న్యాయమూర్తులపై అభాండాలా?

ABN , First Publish Date - 2020-09-19T09:31:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ నేతలు ఏకంగా న్యాయమూర్తులపైనే అభాండాలు వేస్తున్నారని

న్యాయమూర్తులపై అభాండాలా?

వైసీపీది కక్షపూరిత రాజకీయం.. లోక్‌సభలో గల్లా జయదేవ్‌ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ నేతలు ఏకంగా న్యాయమూర్తులపైనే అభాండాలు వేస్తున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు.  ‘‘అమరావతి భూములపై 16 నెలలు దర్యాప్తు చేసి ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు సీబీఐ విచారణను కోరుతున్నారు. అంటే.. ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత వైఫల్యం కాదా?’’ అని జయదేవ్‌ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో దాదాపు 80కిపైగా కేసుల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని, వీటిపై సిగ్గుపడకుండా కోర్టులు, న్యాయమూర్తులపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, గత పదేళ్లుగా ప్రస్తుత సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల సంగతేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.3600 కోట్ల జీఎస్టీ, ఆర్థిక సంఘం గ్రాంట్ల బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలని గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. కరోనా కేవలం ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా వినియోగంపై కూడా ప్రభావం చూపించిందని తెలిపారు.  మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని, దానిలో ప్రజలకు నేరుగా నిధులు ఇచ్చే అంశంపై దృష్టి సారించాలని ప్రతిపాదించారు.  న్యాయ వ్యవస్థను కించపర్చేలా వైసీపీ నేతలు అంబటి రాంబాబు సహా మరి కొందరు మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-19T09:31:11+05:30 IST