-
-
Home » Andhra Pradesh » Frozen transport
-
హాలికుని హాహాకారాలు
ABN , First Publish Date - 2020-03-24T10:15:24+05:30 IST
కరోనా మహమ్మారి దెబ్బకు సీమ రైతు విలవిలలాడుతున్నాడు. మంచి నాణ్యతతో దేశంలోని వివిధ మెట్రో నగరాలకు, విదేశాలకు ఎగుమతి అయ్యే ...

స్తంభించిన రవాణాతో నిలిచిన ఎగుమతులు
దారుణంగా పడిపోయిన ధరలు
పక్వానికి వచ్చినా పొలానికే పరిమితమైన చీనీ, మామిడి, అరటి
కడప, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి దెబ్బకు సీమ రైతు విలవిలలాడుతున్నాడు. మంచి నాణ్యతతో దేశంలోని వివిధ మెట్రో నగరాలకు, విదేశాలకు ఎగుమతి అయ్యే ఉద్యానవన పంటలకు హఠాత్తుగా గిరాకీ పడిపోయింది. కోవిడ్ 19 దెబ్బకు ఎగుమతులు, దిగుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోయింది. దీనితో కొనేవాడే లేక, ఒక వేళ ఎవడైనా వచ్చినా సగానికి సగం ధరకు అమ్మితేనే అంటూ కండిషన్ పెడుతుండడంతో రైతు అల్లాడిపోతున్నాడు. పొలంలో పంటను కుళ్లబెట్ట లేక, అయిన కాడికి అమ్ముకోవాల్సి రావడంతో కుమిలిపోతున్నాడు. పెట్టుబడులు కూడా రాకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ భోరుమంటున్నాడు. కడప జిల్లా పులివెందుల, రైల్వేకోడూరు, మైదుకూరు, కర్నూలు జిల్లాలో మహానంది ప్రాంతాల్లో అరటి అత్యఽధికంగా సాగు చేస్తున్నారు. ఒక్క కడప జిల్లాలోనే 20 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, గుజరాత్, కలకత్తా, ముంబై. చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు అరటి ఎగుమతి అవుతోంది.
నాణ్యతను బట్టి టన్నుకు రూ.10 వేల నుంచి రూ.14,500 వరకు చెల్లిస్తారు. కరోనా ఎఫెక్ట్ వల్ల రవాణా స్తంభించడంతో టన్ను రూ.3500కు కూడా కొనేవారు లేరు. దీంతో ఎకరాకు సరాసరి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అన్నదాత కోల్పోతున్నాడు. జిల్లా నుంచి పులివెందుల, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి రోజుకు 75-100 వెళ్లే అరటి లారీలు ప్రస్తుతం ఒక్కటీ కదలడం లేదు. చీనీ పరిస్థితి దాదాపు ఇదే. గరిష్ఠంగా టన్ను రూ.40 వేలు ధర పలికేది. ప్రస్తుతం రూ.15 - 20 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరాకు రూ.1.20 లక్షలు నష్టపోతున్నామన్నది రైతుల ఆవేదన. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో దోస (కర్బూజ) అధికంగా సాగు చేస్తున్నారు. ఎకరాకు 3 నుంచి 5 టన్నులు దిగుబడి వస్తుంది. ఇక్కడ పండించిన పంటను ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రవాణా లేక పొలంలోనే పంట కుళ్లిపోతోంది. కడప జిల్లాలో పసుపు విదేశాలకు ఎగుమతి అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 3,573 హెక్టార్ల్లు సాగు చేశారు. 2.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దీనిలో అధిక శాతం జపాన్‌కు ఎగుమతి అయ్యేది. అయితే కరోనా దెబ్బకి నౌకలు ససేమిరా అంటున్నాయి. ఆ ప్రభావం ధరలపై పడింది. ఐదు రోజుల క్రితం నాణ్యతను బట్టి క్వింటాల్ రూ.5,800 నుంచి రూ.6 వేల దాకా ఉండేది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5,300 లకు మించి కొనేవారు లేరు. సగటున క్వింటాల్‌కు రూ.1000 దాకా నష్టపోవాల్సి వస్తోంది.
రూ.10 లక్షలు నష్టం
‘‘ఐదు ఎకరాల అరటి సాగు చేశాను. ఎకరాకు 25 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. పంట పక్వానికి వచ్చింది. పంట కోత చేసి అమ్ముదామంటే కరోనా ఎఫెక్ట్‌తో రవాణా లేక వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఢిల్లీ, గుజరాత్ నుంచి వచ్చిన వ్యాపారులు వెళ్లిపోయారు. స్థానిక వ్యాపారులను అడిగితే టన్ను రూ.3,500లకు మించి కొనుగోలు చేయలేమంటున్నారు. సగటున టన్నుకు రూ.10 వేలు నష్టపోతున్నా. ఐదు ఎకరాలకు రూ.10 లక్షలు నష్టాన్ని భరించాల్సి వచ్చింది. టన్ను రూ.3,500లకు కూడా అమ్ముకోకపోతే పొలంలోనే మాగిపోయి చేలోనే వదిలేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- దివాకర్‌రెడ్డి, అరటి రైతు, లింగాల, కడప
పసుపు ఎగుమతి ఆపివేశారు
‘కడప పసుపుకు వివిధ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. జపాన్ క్వాలిటీ పసుపు ఇక్కడ పండిస్తున్నారు. ముంబయి పోర్టు నుంచి నడిచే ఎగుమతులు అన్నీ కరోనా దెబ్బకి నిలిచిపోయాయి. మేము కూడా కొనుగోళ్లు ఆపివేశాం. ఐదారు రోజుల క్రితం కొత్త పసుపు గరిష్ఠంగా క్వింటాల్ రూ.5,800 - రూ.6 వేలు ధర ఉండేది. ప్రస్తుతం రూ.5300లకు పడిపోయింది. రైతులు నష్టపోతున్నారు.
- గుర్రంకొండ మహేశ్, కోశాధికారి,
పసుపు వ్యాపారుల సంఘం, కడప