రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకూ అన్నీ బంద్‌

ABN , First Publish Date - 2020-03-24T12:07:21+05:30 IST

రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకూ అన్నీ బంద్‌

రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకూ అన్నీ బంద్‌

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సోమవారం విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి డీజీపీ గౌతం సవాంగ్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డితో కలిసి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు, తొలిరోజు ఎదురైన సమస్యలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌-1897 మేరకు విడుదల చేసిన జీవో ఎంఎస్‌ 209 మేరకు ఈ నెల 31 వరకూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకూ మెడికల్‌ షాపులు తప్ప అన్ని దుకాణాలూ మూసేయాలని స్పష్టం చేశారు.    విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా హోం క్వారంటైన్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 6 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వారందరినీ త్వరితగతిన గుర్తించి, స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ నీలం సాహ్ని సూచించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. చేయించుకోని వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల రవాణాలో ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని డీజీపీ చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 16 వేల మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2020-03-24T12:07:21+05:30 IST