స్నేహితుడే చోరుడు!

ABN , First Publish Date - 2020-05-09T10:01:21+05:30 IST

కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం అర్ధరాత్రి చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి దుకాణం యజమాని గొంతుకోసి పరారయ్యాడు.

స్నేహితుడే చోరుడు!

జనరల్‌ స్టోర్‌ యజమానిపై కత్తితో దాడి

తప్పించుకునే ప్రయత్నంలో దూకడంతో రెండు కాళ్లూ విరిగిన నిందితుడు


జమ్మలమడుగు రూరల్‌, మే 8: కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం అర్ధరాత్రి చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి దుకాణం యజమాని గొంతుకోసి పరారయ్యాడు. ఈ క్రమంలో పై నుంచి దూకడంతో అతడి కాళ్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఆస్పత్రి పాలైన ఈ ఇద్దరూ స్నేహితులు కావడం గమనార్హం!. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. తాడిపత్రి రోడ్డులోని సంజాములమోటు సమీపాన ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి జనరల్‌ స్టోర్‌ ఉంది. ఆయన నివాసం కూడా అక్కడే. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటాక.. దంపెట్ల లక్ష్మినరసయ్య, దస్తగిరిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. డబ్బు దొంగిలించి తిరిగి వస్తుండగా ఉమామహేశ్వరరావుకు మెలకువ వచ్చింది.


దొంగలను పసిగట్టి గట్టిగా కేకలు పెట్టడంతో వారు కత్తితో ఉమామహేశ్వరరావు గొంతుపై పొడిచారు. అయినా అతను వారిని వెంబడించడంతో తప్పించుకునే క్రమంలో లక్ష్మ్మీనరసయ్య గోడపై నుంచి దూకడంతో రెండు కాళ్లూ విరిగాయి. మరో నిందితుడు తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావును పోలీసులు బెంగళూరు తరలించారు. లక్ష్మీనరసయ్యను మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.


కాగా, చోరీకి వచ్చిన దంపెట్ల లక్ష్మీనరసయ్య, జనరల్‌ స్టోర్‌ యజమాని ఉమామహేశ్వరరావు స్నేహితులు. గతంలో ఉమామహేశ్వరరావు వద్ద లక్ష్మినరసయ్య పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించాడు. లక్ష్మీనరసయ్య ఆటో ఫైనాన్స్‌ తదితర వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోవడంతోపాటు, ప్రస్తుత లాక్‌డౌన్‌తో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. స్నేహితుడైన ఉమామహేశ్వరరావు జనరల్‌ స్టోర్‌లో రోజూ లక్షకుపైగా వ్యాపారం జరుగుతోందని సమాచారం. ఇది తెలిసే స్నేహితుడి ఇంట్లో లక్ష్మీనరసయ్య చోరీకి తెగబడ్డాడు.

Updated Date - 2020-05-09T10:01:21+05:30 IST