టూర్‌... బలాదూర్‌!

ABN , First Publish Date - 2020-04-21T10:15:34+05:30 IST

... మరి ఘనత వహించిన మన నాయకుల ఉల్లంఘనల మాటేమిటి? నిబంధనలు సామాన్యులకేనా? ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆపై అత్యున్నత స్థానంలో ఉన్న వారికి వర్తించవా? ఇవి సామాన్యులు

టూర్‌... బలాదూర్‌!
మందీ మార్బలంతో ఇటీవల బెంగళూరు వెళ్లి తిరిగి వస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో పోలీసులు అడ్డగించడంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి బయటకొస్తున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌(ఫైల్‌)

విచ్చలవిడిగా తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. తరచూ పొరుగు రాష్ట్రాలకూ ప్రయాణాలు

స్థానిక సమీక్షలు వదిలి తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు

ఇతరులు ఇచ్చే చెక్కులతో సీఎంతో ఫొటోలు

భౌతిక దూరం పాటించకుండానే పోజులు

సాయం పంపిణీ పేరిట జన జాతర

సామాన్యులు, ప్రతిపక్ష నేతలకు మాత్రం ‘క్వారంటైన్‌’ హెచ్చరికలు


హైదరాబాద్‌లో చేయడానికి పనిలేదు. హాస్టళ్లు మూసివేశారు. తిండికీ కష్టంగానే ఉంది. మా ఊరు వెళ్లిపోతాం... రాష్ట్రంలోకి అనుమతించండి  అంటూ వందలాది మంది వేడుకుంటే... దాదాపు 8 గంటలు హైవేపైనే నిలబెట్టి, 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే వాళ్లను స్వగ్రామాలకు పంపించారు. 

తప్పదు... ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందే.


తూర్పు గోదావరి జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు. ఆ మండలంలోనే కరోనా వైరస్‌ లేదు. గ్రామ సచివాలయానికి చెందిన నలుగురు మహిళా ఉద్యోగులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. దూరంగా మరో నలుగురు నిల్చుని వేడుకల్లో పాల్గొన్నారు. వీరందరికీ అధికారులు  షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. 

...కరోనా కదా, కఠినంగా వ్యవహరించాల్సిందే అనుకోవచ్చు! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

... మరి ఘనత వహించిన మన నాయకుల ఉల్లంఘనల మాటేమిటి? నిబంధనలు సామాన్యులకేనా? ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆపై అత్యున్నత స్థానంలో ఉన్న వారికి వర్తించవా? ఇవి సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు! లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి ఉన్న చంద్రబాబును క్వారంటైన్‌కు పంపుతాం అని మంత్రులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ... అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్తున్నారు, వస్తున్నారు! ఇటీవల ఒక ఎమ్మెల్యే కర్ణాటక నుంచి ఐదు వాహనాల్లో 30 మందితో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను, కుటుంబ సభ్యులను మాత్రం అనుమతించారు. ఇతరులను వెనక్కి పంపించారు. ఎమ్మెల్యే కుటుంబానికి హోంక్వారంటైన్‌ కూడా విధించలేదు. మరోమంత్రి ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడ ప్రెస్‌మీట్‌ కూడా పెట్టి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఇంకో మంత్రి కూడా హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు ఇద్దరు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఇప్పటికీ యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక... లాక్‌డౌన్‌ అమలులో ఉండగానే జస్టిస్‌ కనగరాజ్‌ చెన్నై నుంచి కారులో విజయవాడకు వచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


చెక్కుల పేరిట హల్‌చల్‌

తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎక్కువమంది మంత్రులు తమతమ నియోజకవర్గాలకే పరిమితమై కరోనా సహాయ చర్యలు, లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షిస్తున్నారు. ఈ దిశగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ... ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. సీఎం సహాయ నిధికి చెక్కులు అందించి, ఆయన దృష్టిలో పడేందుకు నాలుగైదు జిల్లాలు దాటి తాడేపల్లికి వస్తున్నారు. పోనీ ఆ సొమ్ము వారి కష్టార్జితమా అంటే అదీకాదు. ఓ మంత్రి ప్రభుత్వ శాఖ డబ్బును తానే ఇస్తున్నట్లుగా ఫొటోకు పోజు ఇచ్చారు. మరో మంత్రి తన శాఖ డబ్బులు ఇవ్వడానికి తాడేపల్లికి వచ్చారు. మరొకరు కాంట్రాక్టర్ల నుంచి, ఇతర కంపెనీల నుంచి వసూలు చేసిన సొమ్మును సీఎంకు ఇచ్చారు. పోనీ మంత్రులు ఒక్కరే వస్తున్నారంటే అదీకాదు! చెక్కుల పేరుతో గుంపుగా, ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా, ముక్కుకు కర్చీఫ్‌ కూడా కట్టుకోకుండా ముఖ్యమంత్రిని కలిసి వెళ్తున్నారు.భౌతిక దూరం పాటించకుండా ఒకరికొకరు ఆనుకుని నిల్చుంటున్నారు. ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులెవరూ జనానికి అందుబాటులో ఉండటంలేదని, ముఖ్యమంత్రికి కనిపిస్తే చాలు అన్నట్లుగా తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణ  చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


దాతృత్వపు హడావుడి...

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి తరచూ విజయవాడ- విశాఖ మధ్య ప్రయాణిస్తున్నారు. ‘ప్రగతి భారతి’ ట్రస్టు తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తూ సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటిదాకా కరోనా కేసులు నమోదుకాని, గ్రీన్‌జోన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా విజయసాయి రెడ్డి పర్యటించారు. ఇక... కరోనా సహాయం రూ.వెయ్యి పంపిణీ పేరిట వైసీపీ నేతలు చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. వలంటీర్లు చేయాల్సిన పంపిణీని చాలాచోట్ల వీరే హైజాక్‌ చేశారు. నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ పేరిట జాతర చేస్తున్న నాయకులూ ఉన్నారు. కరోనా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇకనైనా ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


కొసమెరుపు: కేంద్రమంత్రి హోదాలో జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చి తన తల్లి సంవత్సరీకం చేసుకోవచ్చు. కానీ స్వీయనిబంధనలు పాటిస్తూ ఢిల్లీలోని తన నివాసంలోనే ఉండి ఆయన ఆన్‌లైన్‌లో కార్యక్రమం పూర్తి చేశారు. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రమంత్రుల నిబద్ధతను పలువురు ప్రశంసిస్తుండగా.. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2020-04-21T10:15:34+05:30 IST