పవన్‌కల్యాణ్‌ పింఛన్‌ పేరిట టోకరా

ABN , First Publish Date - 2020-06-25T08:01:05+05:30 IST

ఆమె వయసు 68 సంవత్సరాలు. సంతానం ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

పవన్‌కల్యాణ్‌ పింఛన్‌ పేరిట టోకరా

నెలకు పదివేలు వస్తాయంటూ జనసేన కార్యకర్త మోసం


పాయకాపురం, జూన్‌ 24: ఆమె వయసు 68 సంవత్సరాలు. సంతానం ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వృద్ధురాలి ఒంటరి తనాన్ని అవకాశంగా తీసుకున్న జనసేన పార్టీ కార్యకర్త ఆమె ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నాడు. దోనేపూడి లక్ష్మి(68) విజయవాడలోని పాయకాపురం సుందరయ్యనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త గతంలో చనిపోయారు. కుమారుడు పైవేటు ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమార్తెకు పెళ్లి చేయడంతో అత్తవారింటికి వెళ్లిపోయారు. దీంతో లక్ష్మి ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నారు.


ఇటీవల ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగిన జనసేన పార్టీ కార్యకర్త బొప్పన శ్యాంసన్‌ ఆమెను పరిచయం చేసుకున్నాడు. పవన్‌కల్యాణ్‌ ఒంటరి వృద్ధులకు నెలకు పదివేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని లక్ష్మిని నమ్మించాడు. ఇదే అదునుగా పవన్‌కల్యాణ్‌ పింఛన్‌ మంజూరు చేసాడంటూ ఓ రోజు పత్రాలతో వచ్చి ఆమె నుంచి సంతకాలు సేకరించాడు. ఆరు నెలల తర్వాత ఆ ఇల్లు తనదేనంటూ బేరం పెట్టాడు. దీంతో లబోదిబో అంటూ లక్ష్మి వ్యవహారాన్ని సంతానం దృష్టికి తీసుకెళ్లి బుధవారం నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-25T08:01:05+05:30 IST