ఇళ్ల స్థలాల అవినీతిలో 40 మంది ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2020-12-25T09:18:31+05:30 IST

ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యవహారంలో నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలకు

ఇళ్ల స్థలాల అవినీతిలో 40 మంది ఎమ్మెల్యేలు!

మేమొస్తే కక్కిస్తాం: టీడీపీ.. భూములపై ఫొటో ఎగ్జిబిషన్‌


అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యవహారంలో నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలకు పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే వారి నుంచి ఆ అవినీతి సొమ్మును కక్కిస్తామని ప్రకటించింది. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వివరిస్తూ గురువారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ప్రభుత్వం సేకరించిన వాటిలో నీటిలో మునిగిపోయినవి, లోతట్టులో ఉన్నవి, కొండలపై ఉన్నవి, శ్మశానాల్లో ఉన్నవి, దారీ డొంకా లేకుండా సుదూరంగా ఉన్నవాటికి సంబంధించి సుమారు వంద ఫొటోలను ప్రదర్శనలో ఉంచారు. వీటిని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరాం, సయ్యద్‌ రఫీ, పార్టీ నేతలు గంజి చిరంజీవి, రఘురామకృష్ణంరాజు తదితరులు తిలకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.


రూ.10 లక్షల విలువ చేసే భూములకు రూ.30 లక్షల వరకూ ధర పెట్టి ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు వాటాలు వేసుకుని పంచుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా రూ.ఆరున్నర వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ఈ అవినీతి లేకపోతే మరో ఇరవై వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసే వీలుండేదని, అదే జరిగితే సెంటు బదులు పేదలకు రెండు సెంట్లు ఇచ్చే అవకాశం ఉండేదని.. వైసీపీ అవినీతికి పేదలు బలయ్యారని తెలిపారు. పైన ఉన్న నాయకుడు ఒక తరహా అవినీతి చేస్తుంటే కింద ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అయినకాడికి దోచుకుతింటున్నారని, జగన్‌ రెడ్డికి దమ్ముంటే ఇళ్ల స్థలాల కుంభకోణంపై సీబీఐ విచారణకు ముందుకు రావాలని దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలి ఇప్పుడు పేదల నుంచి డబ్బు పిండాలని చూస్తోందని నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఇళ్ల పట్టాభిషేకం పేరుతో వైసీపీ నేతలు కనకాభిషేకం చేసుకొన్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రతి నగరంలో ప్యాలె్‌సలు కావాలని, పేదలకు మాత్రం కొండలు, గుట్టలు, శ్మశానాలు కేటాయించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో జగన్‌ ప్రభుత్వం కొత్త మురికివాడలను తయారు చేస్తోందని, పేదల గతి ఎప్పటికీ అలాగే ఉండే పరిస్థితి నెలకొందని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘరామకృష్ణంరాజు విమర్శించారు.

Updated Date - 2020-12-25T09:18:31+05:30 IST