నిజం చెప్పండి
ABN , First Publish Date - 2020-04-21T09:01:36+05:30 IST
‘కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను చెప్పి ప్రజలను విపత్తు నుంచి కాపాడాలి. ఒకవేళ ప్రభుత్వం దాస్తే.. కనీసం ఐఏఎస్ అధికారులయినా ఈ

కరోనాను జగన్ తేలిగ్గా తీసుకున్నారు..
దాని ప్రభావం ఇప్పుడు స్పష్టమవుతోంది
పరీక్ష కిట్లు ఏజెన్సీ ద్వారా ఎలా కొన్నారు?..
సలహాదారులతో సీఎం అభాసుపాలు
విపత్తులను ఎదుర్కోలేని అసమర్థత..
హైకోర్టు మొట్టికాయలు వేసినా మారలేదు
ఎందుకు ఓట్లేశామా అని బాధపడుతున్నారు..
‘స్థానికం’ వాయిదాతో ప్రజలు క్షేమం
కమిషనర్ తొలగింపు దురదృష్టకరం..
జమిలి ఎన్నికలు వస్తేనే ఈ బాధలు తప్పుతాయి
లేదంటే నాలుగేళ్లూ భరించక తప్పదు..
మాజీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలు
విశాఖపట్నం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను చెప్పి ప్రజలను విపత్తు నుంచి కాపాడాలి. ఒకవేళ ప్రభుత్వం దాస్తే.. కనీసం ఐఏఎస్ అధికారులయినా ఈ సమయంలో నిజాలను చెప్పి రాష్ట్రాన్ని రక్షించాలి..’ అని సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైఫల్యాలు తదితర అంశాలపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ సోమవారం నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా పేరు చెబితే యావత్ దేశం, ప్రపంచం వణికిపోతుంటే.. మన సీఎం, మంత్రులు దానిని చాలా తేలికగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఈ ముఖ్యమంత్రికి లేదన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో టెస్టులు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్తు సమయంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాల నేతలతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడారని, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేకుండా పోయుందన్నారు. ‘కరోనా ప్రభావం లేదన్న భావన ప్రజల్లో కల్పించే యత్నాల్లో భాగంగానే వాస్తవాలను దాస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కరోనా టెస్టింగ్ కిట్లను నేరుగా కొనుగోలు చేయకుండా ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి? కేంద్రం ఇచ్చిన డబ్బును తామే ఇస్తున్నామని చెప్పుకోవడం కంటే దానికి అదనంగా రెండు, మూడు వేల రూపాయలు కలిపి ఇచ్చి నిరుపేదలను ఆదుకుంటే బాగుండేది.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా వైర స్ సమయంలో ఎలా ఉండాలి.. ప్రజలకు ఏం చేయాలో హై దరాబాద్ నుంచి సూచనలు చేస్తుంటే.. అధికారంలో ఉండీ జగన్ ఏమీ చేయలేకపోతున్నారు. పైపెచ్చు హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఇక్కడకు వచ్చి మాట్లాడాలని వైసీపీ నేతలు కొందరు అంటుంటే.. వస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని మరికొందరు చెప్పడం దారుణం’ అని దుయ్యబట్టారు. సీఎం సలహాదారులు పక్క రాష్ట్రాల్లో ఉన్నారని, వారి సలహాలతో ఆయన అభాసుపాలవుతున్నారని చెప్పారు. ఇ ప్పటి వరకు పదుల సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. టీడీపీకి 70-80 సీట్లు ఉంటే ఇప్పటికే వైసీపీలో రాజకీయ సంక్షోభం వచ్చి ఉండేదన్నారు.
ఎన్నికలు వాయిదా వేయకుంటే!
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ను తొలగించేందుకు నిస్సిగ్గుగా యత్నించడం దురదృష్టకరమని స బ్బం అన్నారు. ఎన్నికలను రద్దు చేయకుండా కొనసాగిస్తే పెద్ద తప్పిదమయ్యేదని చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్నికలు రద్దు చేస్తే.. కమిషనర్‌ను కులం పే రుతో సీఎం నేరుగా దూషించడం దురదృష్టకరమని చెప్పా రు. ఆయన్ను తొలగిస్తూ రిటైర్డ్ జడ్జిని రాత్రికి, రాత్రి తీసుకువచ్చిన తీరు చూస్తుంటే సీఎంకు ఎన్నికలు ఎంత ముఖ్యమో అర్థమవుతోందన్నారు. జగన్‌కు ఒక చాన్స్ ఇవ్వాలని ఓటేసినవాళ్లు ఏడాది పాలన చూసి తమ చెప్పుతో తాము కొట్టుకుంటున్నారని తెలిపారు. రెండేళ్లలో జమిలి ఎన్నికలు వస్తే ప్రజలకు ఈ బాధలు తప్పుతాయని.. లేకపోతే నాలుగేళ్లు భరించాల్సిందేనని సబ్బం స్పష్టం చేశారు.