అమరావతికి గ్రహణం పట్టించారు: శ్రావణ్
ABN , First Publish Date - 2020-05-29T08:47:09+05:30 IST
’ప్రజారాజధాని అమరావతికి జగన్ గ్రహణం పట్టించారు. రైతుల భాగస్వామ్యంతో చేపట్టిన రాజధానిని

అమరావతి, మే28(ఆంధ్రజ్యోతి): ’ప్రజారాజధాని అమరావతికి జగన్ గ్రహణం పట్టించారు. రైతుల భాగస్వామ్యంతో చేపట్టిన రాజధానిని నిర్వీర్యం చేశారు. మూడు రాజధానుల సంక్షోభం పూర్తిగా వైసీపీ స్వయంకృతాపరాధమే’ అని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ధ్వజమెత్తారు. గురువారం మహానాడులో ప్రజారాజధాని అమరావతి తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడుతూ.. ‘అమరావతిపై అసంబద్ధ ఆరోపణలు చేశారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు. రాజధాని అంటే ఒక సామాజిక వర్గమని ఊదరకొట్టారు. విజయవాడ, గుంటూరు జిల్లాలో 75% ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, ,వైశ్య, ఇతర వర్గాలున్నాయి. ఎడారి, శ్మశానం అన్న రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలెలా ఇస్తారు? రాజధాని భూముల్ని పంచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తప్పుపట్టింది.
వైసీపీకి సిగ్గు రాలేదు’ అని పేర్కొన్నారు. రాజధాని తరలింపును నిరసిస్తూ 160రోజులుగా దళితులు, మహిళలు, పిల్లలు చేస్తున్న ఆందోళనను జగన్ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. వైసీపీ పాలనలో ధరలు కొండెక్కాయని టీడీపీ నేతలు కోట్ల సుజాతమ్మ, బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. ‘ఇసుక, విద్యుత్, పెట్రోల్, మద్యం ధరలు పెంచేశారు. రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. జే ట్యాక్స్ కోసం లాక్‌డౌన్‌లోనూ మద్యం దుకాణాలు తెరిచారు. కరోనా కాలంలోనూ కరెంటు చార్జీలు పెంచి, ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు 4రెట్లు పెంచి, రూ.50వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు’ అని ధ్వజమెత్తారు.