ప్రభుత్వం హద్దుమీరింది
ABN , First Publish Date - 2020-04-26T09:41:40+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎ్‌సఈసీ) వ్యవహారంలో జగన్ ప్రభుత్వం అధికారాలను అతిక్రమించిందని, అందువల్ల ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్,

ఎస్‌ఈసీని ఉద్దేశపూర్వకంగానే వేటు వేసింది
హైకోర్టులో మాజీ మంత్రి కామినేని కౌంటర్
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎ్‌సఈసీ) వ్యవహారంలో జగన్ ప్రభుత్వం అధికారాలను అతిక్రమించిందని, అందువల్ల ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను రద్దు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ హైకోర్టును అభ్యర్థించారు. గతంలో కామినేని వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ వేయగా, ఆయన తిరుగు సమాధాన కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసే ముందు 2011లో కేంద్రం నియమించిన టాస్క్‌ఫోర్స్ చేసిన సిఫారసులను పట్టించుకోలేదన్నారు. ఎస్‌ఈసీకి రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా ఇచ్చిందని, ఎస్‌ఈసీని తొలగించాలంటే హైకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అవలంభించాల్సిన ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని అధికరణ 243(కె)2 మేరకు ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలు, పదవీ కాల నిర్ణేత గవర్నర్ మాత్రమేనని, కానీ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అందుకు భిన్నంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. నిమ్మగడ్డపై ఆరోపణలు నిజమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టి చర్చ జరపాల్సి ఉందని, కానీ ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషన్‌లో వివరించారు. పదవీకాలం నిబంధనలకు రక్షణ లేనిపక్షంలో ఎస్‌ఈసీ రాజ్యాంగ బాధ్యతల్ని నిర్వర్తించలేరని పేర్కొన్నారు. నిబంధనల్ని అతిక్రమించి తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు.