విశాఖ భుజంపై తుపాకీ పెట్టారు

ABN , First Publish Date - 2020-08-04T08:46:23+05:30 IST

‘‘ఉత్తరాంధ్ర ప్రాంతంపై జగన్‌ అండ్‌ కో ఎక్కడ లేని ప్రేమ నటిస్తున్నారు. విశాఖ భుజంపై తుపాకి పెట్టి అమరావతిని చంపాలని చూస్తున్నారు.

విశాఖ భుజంపై తుపాకీ పెట్టారు

  • అమరావతిని చంపాలని చూస్తున్నారు
  • అక్కడి రైతులను నాశనం చేయడానికే ఉత్తరాంధ్రపై కపట ప్రేమ
  • 14 నెలల్లో ‘సుజల స్రవంతి’కి ఒక్క రూపాయి కేటాయించారా!
  • మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపణ

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఉత్తరాంధ్ర ప్రాంతంపై జగన్‌ అండ్‌ కో ఎక్కడ లేని ప్రేమ నటిస్తున్నారు. విశాఖ భుజంపై తుపాకి పెట్టి అమరావతిని చంపాలని చూస్తున్నారు. కేవలం అమరావతి రైతులను నాశనం చేయడానికే విశాఖలో రాజధాని అని జగన్‌ అంటున్నారు తప్ప ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదు’’ అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘విశాఖలో భూముల విలువ ఎక్కువ కాబట్టి దీనిపై కన్నేశారు. జగన్‌కు పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులు, దళారులు కావాలి తప్ప రైతులు కాదు. అమరావతి రైతుల పొట్టగొట్టి తమ కడుపు నింపుకొనే దుర్మార్గులు ఉత్తరాంధ్రవాసులు కారు. ఉత్తరాంధ్రపై జగన్‌కు నిజంగా అంత ప్రేమ ఉంటే హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతంపై కన్నెత్తి చూశారా? జగన్‌ చూపు విశాఖపై పడినతర్వాత ఇక్కడ అన్నీ చెడు శకునాలే చోటు చేసుకొంటున్నాయి. ఆయన హయాంలో ఫ్యాక్షనిస్టులు విశాఖను అడ్డాగా మార్చుకొని భూములపై పడుతున్నారు. ఈ ఫ్యాక్షన్‌ బ్యాచిని విశాఖ ప్రజలు సహించరు’’ అని బండారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రపై నిజంగా ప్రేమ ఉంటే టీడీపీ హయాంలో చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు మళ్ళీ విశాఖకు తిరిగి వచ్చేలా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చంద్రబాబు మంజూరు చేసి పనులు మొదలు పెట్టారని,. ఈ 14 నెలల్లో జగన్‌ ప్రభుత్వం దానికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఇదేనా ఉత్తరాంధ్రపై చూపే ప్రేమ? బొత్స, అవంతి, ధర్మాన వంటి వైసీపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి అని బండారు డిమాండ్‌ చేశారు. బీజేపీలోని కొందరు నేతలు వైసీపీకి అమ్ముడుపోయి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఆ పార్టీలోని ముగ్గురు ప్రధాన నాయకులు జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ మోదీ, షాలకు తప్పుడు సమాచారం అందచేస్తున్నారని బండారు విమర్శించారు.

Updated Date - 2020-08-04T08:46:23+05:30 IST