ఈ వైసీపీ కాటయ్య.. కన్నేస్తే వదలడు!

ABN , First Publish Date - 2020-09-12T19:39:26+05:30 IST

వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. ఓ వైపు దాడులు... మరో వైపు మహిళలపై లైంగిక వేధింపులు. ప్రస్తుతం ఏపీలో ఇదే ట్రెండ్

ఈ వైసీపీ కాటయ్య.. కన్నేస్తే వదలడు!

నెల్లూరు: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. ఓ వైపు దాడులు... మరో వైపు మహిళలపై లైంగిక వేధింపులు. ప్రస్తుతం ఏపీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. మహిళలను వేధిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ జగన్ సర్కార్ ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టమంటే వైసీపీ నేతలకు భయం లేదో.. ఏమో తెలియదు గానీ.. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏకంగా కూతురు వరుస అయ్యే యువతనే లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు దిగాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది.


అతడి పేరు కాటయ్య.. మాజీ కౌన్సిలర్. ప్రస్తుతం వైసీపీ నేతగా కొనసాగుతున్నాడు. వరుసకు ఆ యువతికి బాబాయ్ అవుతాడు. ఆమెకు పెళ్లైంది. పిల్లలున్నారు. అయినా కామాంధుడు వదిలిపెట్టలేదు. కామంతో కళ్లు మూసుకుపోయాయి. అమాయకురాలైన యువతిపై వేధింపులకు దిగాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ ఫోన్లో, వాట్సాపుల్లో టార్చర్ పెట్టాడు. గత కొద్ది రోజులుగా అతడి ఆగడాలు మరింత శృతిమించాయి. ‘నన్ను బాబాయ్ అని పిలవొద్దని.. నువ్వంటే ఇష్టం’ అంటూ నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. ఆ దుర్మార్గుడి మాటలు విన్న బాధితురాలు.. తండ్రి స్థానంలో ఉన్న నీవు ఇలా మాట్లాడడం సరికాదని సర్దిచెబుతూ తనను వదిలేయాలని ప్రాధేయపడింది. అయినా కామాంధుడు వదిలిపెట్టలేదు. తన కోరిక తీర్చాల్సిందేనని... బాబాయ్ అని మాత్రం పిలవొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ నీచుడి టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమెతో పాటు మరో మహిళను కూడా అలానే ఇబ్బందులకు గురిచేశాడు. 


కాటయ్య వేధించిన మహిళలెవరో కాదు.. సూళ్లూరుపేటలో మహిళా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. కామాంధుడైన కాటయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా వాలంటీర్లు పోలీసులను వేడుకున్నారు. కాటయ్య మాట్లాడిన వాయిస్‌ రికార్డులను పోలీసులకు అప్పగించారు.


భార్యకు చెబితే.. కాల్ ఎందుకు రికార్డ్ చేశావంది?

కాటయ్య దుర్మార్గాలను అతడి భార్యకు వినిపిస్తే.. అసలు ఎందుకు రికార్డ్ చేశావంటూ కాటయ్యనే సపోర్ట్ చేస్తూ మాట్లాడిందని బాధితురాలు వాపోయింది. అర్ధరాత్రి, అపరాత్రి ఫోన్ చేస్తూ తనను వేధిస్తున్నాడని కన్నీటిపర్యంతమైంది. ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా తనకే ముందు చెప్పాలంటూ హుకుం జారీ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా అయితే పని చేయలేమంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.


కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు కూడా అదే తీరు..

ఇక కాటయ్య ఆగడాలు గురించి సూళ్లూరుపేట ప్రజలు చర్చించుకుంటున్నారు. కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు కూడా తోటి మహిళా కౌన్సిలర్లను కూడా ఇలానే లైంగికంగా వేధించేవాడని చెప్పుకుంటున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సహచర వైసీపీ నేతలు కూడా కాటయ్య నీచ బుద్ధిని అసహ్యించుకుంటున్నారు. అతన్ని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  


ఈ ఘటనపై మహిళా కమిషన్, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇటీవల నెల్లూరు పర్యాటక కేంద్రంలో ఓ దివ్యాంగురాలిపై అధికారి దాడి చేసిన ఘటనపై వేగంగా స్పందించింది. తాజా ఉదాంతంపై ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - 2020-09-12T19:39:26+05:30 IST